ఇంగ్లాండ్‌కు భారత్ గట్టి కౌంటర్.. యూకే పౌరులందరికీ తప్పనిసరి క్వారంటైన్

భారత్ ప్రభుత్వం ఇంగ్లాండ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత పౌరులకు ఎలాగైతే తప్పనిసరి క్వారంటైన్ అమలు చేయాలని నిర్ణయించిందో అదే తీరులో యూకే పౌరులకు భారత్ చేరగానే పది రోజుల తప్పనిసరి క్వారంటైన్ నిబంధనను అమలు చేయనున్నట్టు వెల్లడించింది. 

india to take counter measures against UK making mandatory quarantine

న్యూఢిల్లీ: యూకేకు గట్టి కౌంటర్ ఇచ్చేలా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూకే నుంచి మనదేశానికి వచ్చే వారందరికీ పది రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. భారత ప్రయాణికులపట్ల యూకే ప్రభుత్వం ఇటీవలే ఇదే నిర్ణయం తీసుకుంది. దీనికి కౌంటర్‌గానే భారత ప్రభుత్వం తాజా సవరణలు చేసింది.

తాజా నిబంధనలు ఇలా ఉన్నాయి. ఈ నెల 4వ తేదీ నుంచి యూకే నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కింది నిబంధనలు పాటించాలి. వ్యాక్సినేషన్ వేసుకున్నా.. వేసుకోకున్నా.. ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

భారత్‌కు ప్రయాణం చేయడానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్టులో కరోనా నెగెటివ్ రిపోర్టు కలిగి ఉండాలి. భారత్‌ చేరగానే ఎయిర్‌పోర్టులోనూ కొవిడ్-19 ఆర్టీ పీసీఆర్ టెస్టు చేసుకోవాలి. వచ్చాక 8వ రోజూ మరోసారి ఇదే టెస్టు చేసుకోవాలి. దేశంలో అడుగుపెట్టాక పది రోజులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలి. హోం మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖ ఈ నిబంధనల అమలుకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటాయి.

అక్టోబర్ 4వ తేదీ నుంచి యూకే ఇలాంటి నిబంధనలనే అమలు చేయనుంది. వ్యాక్సిన్ తీసుకున్నవారందరికీ తప్పనిసరి క్వారంటైన్‌ను మినహాయిస్తూ యూకే నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్ సహా పలుదేశాల పౌరులకు ఈ మినహాయింపును ఇవ్వలేదు. ఇక్కడి టీకాలను ఆ దేశం తన పరిగణనలోకి తీసుకోవడం లేదు. కొవిషీల్డ్ టీకా యూకేలో తీసుకున్న వారినే వ్యాక్సినేటెడ్‌గా పరిగణిస్తున్నది. అదే కొవిషీల్డ్ ఇండియాలో తీసుకుంటే వ్యాక్సిన్ తీసుకోనివారిగనే యూకే పరిగణిస్తున్నది. దీంతో భారత పౌరులు యూకే చేరితే క్వారంటైన్ తప్పనిసరి కానుంది. దీనిపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ యూకే నిబంధనలు సవరించలేదు. తాజాగా, కేంద్ర ప్రభుత్వమే అందుకు కౌంటర్‌గా కఠిన నిబంధనలు అమలు చేయడానికి సిద్ధమైంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios