ఎస్‌సీఓ సదస్సు.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆహ్వానం పంపనున్న భారత్..!
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు కోసం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను భారత్ ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం షాంఘై సహకార సంస్థ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్.. ఈ ఏడాది సమావేశాలను గోవాలో మే 4,5 తేదీల్లో నిర్వహించనుంది.

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు కోసం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను భారత్ ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం షాంఘై సహకార సంస్థ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్.. ఈ ఏడాది సమావేశాలను గోవాలో మే 4,5 తేదీల్లో నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి భారత్.. పాకిస్తాన్, చైనాతో సహా సభ్య దేశాలకు ఆహ్వానాలను పంపింది. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో, చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్‌లకు గోవాలో జరిగే ఎస్‌సిఓ సదస్సుకు సంబంధించిన ఆహ్వానాలను అందజేశారు. నిర్దేశిత ప్రక్రియలో భాగంగా ఆహ్వానాలు పంపబడ్డాయని.. అయితే ఈ కార్యక్రమానికి బిలావల్ భుట్టో, క్విన్ గ్యాంగ్ హాజరవుతారో లేదో ధృవీకరించబడలేదని సమాచారం. మరోవైపు త్వరలోనే పాక్ ప్రధానికి కూడా ఆహ్వానం పంపనున్నట్టుగా తెలుస్తోంది.
ఒకవేళ పాకిస్థాన్ ప్రధాని లేదా విదేశాంగ మంత్రి ఈ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని నిర్ణయించుకుంటే.. 2011 తర్వాత పాక్ నుంచి ఆ హోదాలో ఉన్న నేతలు భారత్‌ను సందర్శించడం ఇదే తొలిసారి అవుతుంది. ఇక, చివరిగా అప్పటి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ ఆ ఏడాది భారత్‌లో పర్యటించారు.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతిస్పందనగా 2019 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేయడంతో భారతదేశం- పాకిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదే ఏడాది ఆగష్టులో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక అధికారాలను ఉపసంహరించుకోవడం, కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు భారత్ ప్రకటించిన తర్వాత సంబంధాలు మరింత క్షీణించాయి. అయితే మే నెలలో గోవాలో జరగనున్న ఎస్‌సీఓ సదస్సుకు పాకిస్తాన్ హాజరవుతుందా? లేదా? అనే ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే.. భారత్ గత సెప్టెంబర్‌లో ఎస్‌సీఓ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. ఎస్‌సీఓలో భారత్, పాకిస్తాన్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.