న్యూఢిల్లీ: శత్రు దేశాల రాడార్లను మట్టికరిపించడగల రుద్రం-1 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది.

బాలాసోర్ నుండి శుక్రవారం నాడు ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థలను దెబ్బతీసే సామర్ధ్యం దీనికి ఉంది. భారత వాయిసేనకు చెందిన సుఖోయ్ 30 ఫైటర్ ద్వారా ఈ మిస్సైల్ ను శుక్రవారం నాడు పరీక్షించారు. డీఆర్‌డీఓ ఈ మిస్సైల్ ను తయారు చేసింది.

ఈ మిస్సైల్ భారత వైమానిక దళ యుద్ధ విమానాలకు వాయి ఆధిపత్యాన్ని, వ్యూహాత్మక సామర్ధ్యాన్ని అందించనుంది.శత్రు దేశాలకు చెందిన  రాడార్లు, ట్రాకింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలను నాశనం చేయడానికి వివిధ రకాల ఎత్తుల నుండి కూడ ప్రయోగించవచ్చు.

తొలుత సుఖోయ్ ద్వారానే ఈ మిస్సైల్స్ ను ప్రయోగించారు. భవిష్యత్తులో మిరాజ్ 2000, హెచ్ఎఎల్ తేజాస్, హెచ్ఎఎల్ మార్క్ 2 ద్వారా కూడ ప్రయోగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది భారత వైమానిక దళం.

ఈ కొత్త తరం యాంటీ రేడియేషన్ మిస్సైల్ 100 నుండి 150 కి.మీ దూరం లక్ష్యాలను చేధించనుంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో దీన్ని తయారు చేశారు.  ఇది  సింగిల్ స్టేజ్ క్షిపణి.దీని బరువు 140 కిలోలు.

కనిష్టంగా 500 మీటర్లు, గరిష్టంగా 15 కి,మీ ఎత్తు నుండి దీన్ని ప్రయోగించేలా రూపొందించారు. ఈ పరీక్ష విజయవంతం కావడంపై దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.