భారత రక్షణ వ్యవస్థ రోజు రోజుకు బలోపేతం అవుతోంది. ఆదివారం డీఆర్డీవో ప్రయోగించిన మీడియం రేంజ్ మిస్సైల్ టెస్ట్ విజయవంతం అయ్యింది. ఇది లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్డీవో తెలిపింది.
ఒడిశాలోని బాలాసోర్ తీరంలో ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే మధ్యస్థ శ్రేణి క్షిపణిని విజయవంతంగా ఆదివారం పరీక్షించింది. ఈ విషయాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అధికారికంగా వెల్లడించింది.
“ MRSAM-ఆర్మీ క్షిపణి వ్యవస్థ విమానం ఒడిశా ITR బాలాసోర్ నుంచి 10.30 గంటలకు సుదూర శ్రేణిలో హై-స్పీడ్ వైమానిక లక్ష్యాన్ని ఛేదించింది. లక్ష్యాన్ని క్షిపణి నేరుగా ఢీకొట్టి ధ్వంసం చేసింది’’ అని DRDO పేర్కొంది. ఈ వ్యవస్థ భారత సైన్యంలో భాగమని తెలిపింది. ఆదివారం నిర్వహించిన పరీక్షలో క్షిపణి చాలా దూరంలో ఉన్న లక్ష్యాన్ని నేరుగా ఛేదించిందని DRDO అధికారులు వెల్లడించారు.
జనవరి 20వ తేదీన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి అనేక కొత్త స్వదేశీ వ్యవస్థలను పరీక్షించారు. “ పెరిగిన స్వదేశీ కంటెంట్, మెరుగైన పనితీరుతో కూడిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని జనవరి 20న ఒడిశా తీరంలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి ఉదయం 10.30 గంటలకు విజయవంతంగా పరీక్షించారు. DRDO బృందాలతో సన్నిహిత సమన్వయంతో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ టెక్స్ట్ బుక్ ఫ్లైట్‌లో, క్షిపణి అన్ని మిషన్ లక్ష్యాలను చేరుకోవడానికి అంచనా వేసిన పథాన్ని అనుసరించింది” అని DRDO తెలిపింది.
