భారత్‌లో 3,424కు పెరిగిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య.. వివరాలు ఇవే..
చైనాతో పాటు పలు దేశాల్లో మరోసారి కరోనా కేసుల్లో భారీ పెరుగుదల ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా ఆందోళనల నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.

చైనాతో పాటు పలు దేశాల్లో మరోసారి కరోనా కేసుల్లో భారీ పెరుగుదల ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా ఆందోళనల నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అయితే భారత్‌లో కూడా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 227 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,424కు పెరిగింది. 24 గంటల వ్యవధిలో 27 కేసుల పెరుగుదల నమోదైంది. ఇక, తాజా కేసులతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,77,106గా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
గత 24 గంటల్లో దేశంలో రెండు కరోనా మరణాలు నమోదయ్యాయి. అందులో ఒకటి మహారాష్ట్రలో, మరోకటి కేరళలో నమోదయ్యాయి. ఈ మరణాలతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 5,30,693కి చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల మొత్తం.. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.01 శాతంగా ఉంది. కోవిడ్ రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. ఇక, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,42,989కి చేరుకుంది. ఇక, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.05 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి.
ఇక, భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 2020 ఆగస్టు 7న 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షలు, సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు దాటింది. అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్‌ను అధిగమించింది. కరోనా కేసుల సంఖ్య గత ఏడాది మే 4న రెండు కోట్లు, జూన్ 23న మూడు కోట్ల మార్క్‌ను దాటింది. ఈ ఏడాది జనవరి 25న నాలుగు కోట్ల మార్కును దాటింది.
ఇదిలా ఉంటే.. చైనాతో సహా అనేక దేశాలలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను నిరంతరం అప్రమత్తం చేస్తోంది. కోవిడ్ సంబంధిత మార్గదర్శకాలను జారీ చేస్తోంది. ప్రపంచంలో పెరుగుతున్న కరోనా ముప్పును దృష్టిలో ఉంచుకుని.. మంగళవారం (డిసెంబర్ 27) దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాస్తూ ఆదేశాలు జారీ చేశారు.
దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, ప్రజలు మాస్క్‌లు ధరించాలని, అలాగే కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. జీనోమ్ సీక్వెన్సింగ్ , కోవిడ్ పరీక్షలను పెంచడం గురించి కూడా మోదీ మాట్లాడారు. నిర్లక్ష్యానికి పాల్పడిన ప్రజలను హెచ్చరిస్తూ, కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కోవిడ్ ఇంకా ముగియలేదని ప్రధాని చెప్పారు.