Coronavirus: ఒక్కరోజే 1100లకు పైగా కరోనా మరణాలు
Coronavirus: దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతున్నది. అయితే, నిత్యం రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా, గత 24 గంటల్లో కొత్త కేసుల్లో భారీ తగ్గుదల చోటుచేసుకుంది. రోజువారీ కేసులు రెండు లక్షల దిగువకు పడిపోగా, మరణాలు మాత్రం 1100 లకు పైగా నమోదయ్యాయి.
Coronavirus: అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. దక్షిణాఫ్రికాలో గత నవంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భారత్ లోనూ కరోనా వైరస్ పంజా విసురుతోంది. కోవిడ్-19 థర్డ్ వేవ్ అంచనాలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. కరోనా (Coronavirus)మహమ్మారి సాధారణ కేసులతో పాటు ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు మొత్తం దేశంలో నాలుగు కోట్ల మార్కును అందుకున్నాయి. కరోనా కేసులు నిత్యం రెండు లక్షలకు పైగా నమోదవుతూ వస్తున్నాయి. అయితే, గత 24 గంటల్లో రోజువారీ (Coronavirus) కేసులు భారీగా తగ్గాయి. కొత్త కేసులు లక్షన్నరకు పడిపోగా, కోవిడ్-19 మరణాలు మాత్రం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వైరస్ వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,67,059 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే.. 20 శాతం కొత్త కేసుల్లో తగ్గుదల చోటుచేసుకుంది. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,14,69,499 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 17,43,059 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా వైరస్ బారినుంచి 2,54,076 మంది కోలుకున్నారు. మొత్తం కరోనా రికవరీల సంఖ్య 3,92,30,198కి చేరింది. దేశంలో కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. మరణాలు మాత్రం క్రమంగా పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
గత 24 గంటల్లో దేశంలో కొత్తగా కరోనా వైరస్ తో పోరాడుతూ 1,192 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా రోజుల తర్వాత రోజువారి కోవిడ్ మరణాలు వేయి మార్కును దాటాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4,96,242కు పెరిగింది. కొత్తగా నమోదైన కోవిడ్ మరణాల్లో అత్యధికం 638 దక్షిణాది రాష్ట్రమైన కేరళలో వెలుగుచూశాయి. దేశంలో కోవిడ్ పాజిటివిటీ రేటు సైతం తగ్గుముఖం పడుతున్నది. పాజిటఙవిటీ రేటు 15.7 శాతం నుంచి 11.6 శాతానికి పడిపోయింది. అయితే వారాంతపు పాజిటివిటీ రేటు మాత్రం 15.25 శాతంగా ఉంది. COVID-19 రికవరీ రేటు ప్రస్తుతం 94.6 శాతంగా ఉండగా, మరణాలు రేటు 1.20 శాతంగా ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చర్యలను కొనసాగిస్తున్నాయి. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు కరోనా పరీక్షలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.
కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో ఇప్పటివకు మొత్తం 166.68 కోట్ల కరోనా వైరస్ టీకా డోస్‌లను పంపిణీ చేశారు. ఇందులో మొదటి డోసు తీసుకున్న వారు 89.4 కోట్ల మంది ఉన్నారు. రెండు డోసులు తీసుకున్న వారు 70.8 కోట్ల మంది ఉన్నారు. మొత్తంగా దేశ వయోజన జనాభాలో 75 శాతం మంది పూర్తిగా వ్యాక్సినేషన్‌ను అందించారు. కరోనా పరీక్షలు సైతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం 72,89,97,813 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆ) వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 13,31,19 కోవిడ్-19 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది.