న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో  1,27,510  కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో  దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 28,175,044కి చేరుకొంది. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీ తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో  కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.గత 24 గంటల్లో కరోనాతో  2,796 మంది మరణించారు. ఈ ఏడాది ఏప్రిల్ 26 తర్వాత  దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య అతి తక్కవగా నమోదు కావడం ఇదే తొలిసారిగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి.  దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,31,895కి చేరుకొంది. 

లాక్‌డౌన్  నేపథ్యంలో  దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. గత 24 గంటల వ్యవధిలో తమిళనాడు రాష్ట్రంలో 27,936 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక కేసులు తమిళనాడులోనే రికార్డయ్యాయి. తమిళనాడు తర్వాత కర్ణాటకలో అత్యధిక కేసులు రికార్డయ్యాయి. ఈ రాష్ట్రంలో 16,600 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 16,077 కేసులు, కేరళలో 12,300 కరోనా కేసులు రికార్డయ్యాయి.