అరుణాచల్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించడంపై చైనా అభ్యంతరం తెలిపింది. దీంతో చైనాకు దీటుగా భారత్ బదులిచ్చింది. భారతదేశ ప్రాదేశిక సమగ్రతను ఎవరూ ప్రశ్నించలేరని భారత్ పేర్కొంది.
చైనా మరోసారి తన కుటిల బుద్దిని బయటపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌లో హోంమంత్రి అమిత్ షా పర్యటించడంపై చైనా అభ్యంతరాలు చేసింది. అమిత్ షా అరుణాచల్ పర్యటన సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని చైనా అభివర్ణించింది. ఈ పర్యటన బీజింగ్ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని చైనా పేర్కొంది.కాగా, ఈ వ్యాఖ్యలను భారత్ పూర్తిగా తోసిపుచ్చింది.
చైనా ప్రకటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. 'చైనా అధికారిక ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా తిరస్కరిస్తున్నాము. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల వలే భారత నాయకులు, మంత్రులు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని క్రమం తప్పకుండా సందర్శిస్తుంటారు." అన్నారు. అరుణాచల్ కూడా భారతదేశంలో అంతర్భాగమనీ, దాని విడదీయలేమనీ పేర్కొన్నారు. ఇటువంటి సందర్శనలపై అభ్యంతరం చెప్పడం తగదని, వాస్తవికతను మార్చదని అన్నారు. చైనా స్పందనపై మీడియా ప్రశ్నలకు బాగ్చి స్పందించారు.
అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ..చైనాపై విమర్శలు గుప్పించారు. భారతదేశ ప్రాదేశిక సమగ్రతను ఎవరూ ప్రశ్నించలేరని ఆయన అన్నారు. మా దేశ భూమిలో ఒక్క అంగుళం కూడా ఎవరూ లాక్కొలేరని షా అన్నారు. అరుణాచల్‌లోని కిబితు గ్రామంలో కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలను హోంమంత్రి ప్రారంభించారు. ఈ గ్రామం భారతదేశం , చైనా సరిహద్దులో ఉంది. ఐటీబీపీ, ఆర్మీ జవాన్ల ధైర్యసాహసాల వల్ల మన దేశ సరిహద్దులను ఎవరూ కళ్లు పైకెత్తి చూడలేకపోతున్నారని అమిత్ షా అన్నారు. భారత భూమిని ఎవరైనా ఆక్రమించుకునే కాలం పోయింది. నేడు సూది మొనతో కూడా భూమిని ఎవరూ ఆక్రమించలేరు.
చైనా అభ్యంతరం
హోంమంత్రి అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను తన సార్వభౌమాధికారానికి భంగం కలిగించడమేనని అభివర్ణించిన చైనా.. హోంమంత్రి అమిత్ షా పర్యటన శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుందని, సరిహద్దులో ఇరు దేశాల పరిస్థితిని చెడగొడుతుందని భారత్‌ను బెదిరించింది. ఇదిలా ఉంటే.. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను చైనా మార్చింది. ఆ తర్వాత అమిత్ షా పర్యటన జరిగింది. చైనా మార్చిన పేర్లను భారత్ కూడా పూర్తిగా తిరస్కరించింది.
భారత్, చైనాల మధ్య వివాదం ఏమిటి?
భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్‌తో సహా దాదాపు 90 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంపై చైనా ఆరోపణలు చేస్తోంది. ఈ ప్రాంతాన్ని జంగ్నాన్ అని పిలుస్తారు.దీనిని దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా ఆరోపిస్తుంది. దాని మ్యాప్‌లో కూడా అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో భాగంగా చూపిస్తుంది. కొన్నిసార్లు ఇది చైనీస్ మ్యాప్‌లో అరుణాచల్ ప్రదేశ్ అని కూడా పిలువబడుతుంది. ఈ భారత భూభాగంపై తన హక్కును చాటుకునేందుకు చైనా ఎప్పటికప్పుడు పలు దుర్చర్యలను పాల్పడుతోంది.
