ఇరాన్ ప్రెసిడెంట్‌కు ప్రధాని మోడీ ఫోన్.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై సంభాషణ
ఇరాన్ ప్రెసిడెంట్ సయ్యిద్ ఇబ్రహిం రైసీకి తెలంగాణ ప్రధాని మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. పశ్చిమాసియాలో పరిస్థితులు, ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధ పరిస్థితులపై మాట్లాడారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇరాన్ అధ్యక్షుడు సయ్యిద్ ఇబ్రహిం రైసీ సోమవారం ఫోన్ చేసి మాట్లాడారు. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంపై సంభాషించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఆపత్కర పరిస్థితులు, ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై ఉభయ నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. వెంటనే శాంతి పునరుద్ధరించడానికి, మానవతా సహాయం కొనసాగడానికి సంబంధించిన అంశాలపై మాట్లాడుకున్నారు.
పశ్చిమాసియాలో ఉగ్రవాద ఘటనలు, హింస, పౌరుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు అధికారిక ప్రకటన వెల్లడించింది. ఇజ్రాయెల్ - పాలస్తీనా సమస్యపై భారత్ తన సుదీర్ఘ వైఖరిని కొసాగిస్తుందని పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా, ఇరాన్ అధ్యక్షుడు అక్కడి పరిస్థితులపై ఆయన అభిప్రాయాన్ని తెలిపారు.
పశ్చిమాసియాకు సంబంధించి ఉభయ దేశాల ప్రయోజనాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని టచ్‌లో ఉండాలని ఇద్దరూ అభిప్రాయానికి వచ్చారు. ఉభయ దేశాల మధ్య బహువిధ ద్వైపాక్షిక సమన్వయంలో పురోగతికి సానుకూలంగా సమీక్ష చేసుకున్నారు. రీజినల్ కనెక్టివిటీ పెరగడానికి చాబహర్ పోర్టుకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఉభయ నేతలు స్వాగతించారు.
Also Read: జైలు నుంచే ఢిల్లీ ప్రభుత్వం నడుస్తుంది, క్యాబినెట్ సమావేశాలు కూడా జైలులోనే..! :ఆప్ సంచలన నిర్ణయాలు
ప్రధాని మోడీ ఇజ్రాయెల్, జోర్డాన్, ఈజిప్ట్, యూకే, యూఏఈ దేశాల నేతలతో ఇటీవలే మాట్లాడారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చలు చేశారు.