యూకే నుంచి కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్‌కు తెచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. యూకే సహా ఇతర వలసవాద దేశాల్లోని మన దేశ పురాతన విలువైన వస్తువులు, విగ్రహాలు, వజ్రాలను తిరిగి తెచ్చుకునే ప్రణాళికలు చేసినట్టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు తెలిపారు. 

న్యూఢిల్లీ: వలసవాదుల కాలంలో మన దేశానికి చెందిన ఎన్నో విలువైన ఆభరణాలు, వజ్రాలు, విగ్రహాలను విదేశాలకు తరలిపోయాయి. కొన్ని రాజుల నుంచి బహుమానాలుగా, చాలా వరకు అక్రమ మార్గాల్లో యూకే వంటి వలసవాదుల దేశాలకు వెళ్లిపోయాయి. ఇందులో అందరి మదిలో మెదిలో కోహినూర్ వజ్రం కూడా ఒకటి. ఈ కోహినూర్ వజ్రం యూకే రాజవంశం వద్ద ఉన్నది. ఇటీవలే ఎలిజబెత్ మహారాణి మరణించినప్పుడు కోహినూర్ గురించిన చర్చ జరిగింది. ఆమె కిరీటంలోని కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్‌కు అప్పగించాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే యువరాణి పట్టాభిషేకం జరుగుతుండగా క్వీన్ కామిలియా కోహినూర్ వజ్రాన్ని ఎంచుకోకుండా ప్రత్యామ్నాయ వజ్రాన్ని తీసుకుంది.

తాజాగా, మళ్లీ కోహినూర్ వజ్రంపై చర్చ మొదలైంది. కోహినూర్, ఇతర విలువైన పురాతన వస్తువులను యూకే సహా ఇతర దేశాల నుంచి తిరిగి భారత్‌కు తెప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్నదని యూకే చెందిన ది టెలిగ్రాఫ్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ వస్తువులను స్వదేశానికి తీసుకెళ్లడంపై ఆలోచనలు చేస్తున్నదని, త్వరలోనే దౌత్యమార్గంలో ఇందుకు సంబంధించిన డిమాండ్ రావొచ్చని పేర్కొంది. 

ముందు సులువుగా వాటిని వెనక్కి తీసుకునే చోట్ల నుంచి ఈ తరలింపు ప్రారంభం కావొచ్చని, అంటే చిన్న చిన్న మ్యూజియాల్లోని భారత్‌కు చెందిన విలువైన వస్తువులు, వ్యక్తుల వద్ద ఉన్న వీటిని తొలుత తీసుకెళ్లవచ్చని ఆ పత్రిక అంచనా వేసింది. ఎందుకంటే.. వాటిని తిరిగి వెనక్కి తీసుకెళ్లడం సులువు అని తెలిపింది. ఆ తర్వాత పెద్ద మ్యూజియాల్లో నుంచి విలువైన వాటిని తీసుకెళ్లడానికి డీల్ కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతాయని పేర్కొంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీటిని వెనక్కి తీసుకెళ్లడానికి సంబంధించి క్రియాశీలకంగా ఉన్నదని వివరించింది.

Also Read: యూపీ లోని అయోధ్యలో హిందు ప్రాబల్యం గల వార్డులో స్వతంత్ర ముస్లిం అభ్యర్థి గెలుపు.. దీని పై స్థానికులు ఏమని అంటున్నారంటే?

నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా దీన్ని ప్రధానాంశంగా తీసుకున్నారని, అందుకే వీటి తరలింపు ప్రక్రియ వేగంగా జరగొచ్చని భారత సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అన్నట్టు ది టెలిగ్రాఫ్ రిపోర్ట్ చేసింది.

మన దేశం నుంచి వెళ్లిపోయిన వాటిని తిరిగి తెచ్చుకునే ప్రక్రియ చేపడుతున్నట్టు ఏఎస్ఐ సీనియర్ అధికారులు తెలిపారు. యూకే, యూఎస్‌ల నుంచి సుమారు 100 విలువైన వస్తువులను వెనక్కి తెచ్చే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నదని ఆయన చెప్పి నట్టు పీటీఐ రిపోర్ట్ చేసింది.