Asianet News TeluguAsianet News Telugu

అయోధ్యలో హిందు ప్రాబల్య వార్డులో స్వతంత్ర ముస్లిం అభ్యర్థి గెలుపు.. స్థానికులు ఏమంటున్నారంటే?

అయోధ్య పట్టణంలో హిందూ ప్రాబల్యం అధికంగా ఉన్న ఓ వార్డులో స్వతంత్రంగా పోటీ చేసిన ఓ ముస్లిం అభ్యర్థి విజయ ఢంకా మోగించారు. మరో స్వతంత్ర అభ్యర్థి రెండో స్థానంలో నిలవగా బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. 
 

independent muslim candidate won in hindu dominated ward of ayodhya in uttar pradesh kms
Author
First Published May 14, 2023, 1:02 PM IST

లక్నో: అయోధ్య అంటే ప్రపంచానికి తెలిసిన పట్టణం. రామ జన్మభూమిగా ఇటీవలి కాలంలో విశేష ప్రచారానికి నోచుకుంది. ఈ పట్టణంలో హిందు ప్రాబల్య వార్డులో స్వతంత్రంగా పోటీ చేసిన ఓ ముస్లిం అభ్యర్థి గెలవడం సంచలనంగా మారింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శనివరం వెల్లడయ్యాయి.

అయోధ్యలో రామ జన్మభూమికి సమీపంగానే రామ్ అభిరామ్ దాస్ అనే వార్డు ఉన్నది. రామజన్మభూమి టెంపుల్ మూవ్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పేరునే ఆ వార్డుకు పెట్టుకున్నారు. యూపీ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇక్కడా పోలింగ్ జరిగింది. హిందుత్వకు కీలకంగా ఉండే అయోధ్య పట్టణంలోని ఈ వార్డులో స్వతంత్రంగా పోటీ చేసిన ఓ ముస్లిం అభ్యర్థి విజయం సాధించగా.. బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.

ఈ వార్డులో సుల్తాన్ అన్సారీ అనే స్థానిక యువకుడు తొలిసారి ఎన్నికల బరిలో నిలబడ్డాడు. ఈ వార్డులో మొత్తం సుమారు నాలుగు వేలకు పైగా ఉన్నారు. 3,844 హిందు ఓటర్లు, 440 మంది ముస్లిం ఓటర్లు. అంటే ఈ వార్డులో 11 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. బరిలో పది మంది అభ్యర్థులు నిలబడ్డారు.

కాగా, ఎన్నికలో 2,388 మంది ఓట్లు వేశారు. అందులో 42 శాతం అంటే.. 996 ఓట్లు సుల్తాన్ అన్సారీ పడ్డాయి. మరో స్వతంత్ర అభ్యర్థి నాగేంద్ర మాంఝీపై 442 ఓట్ల మార్జిన్‌తో సుల్తాన్ అన్సారీ గెలిచాడు. కాగా, బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. 

‘అయోధ్యలో హిందు, ముస్లింలు సహోదరభావంతో శాంతియుతంగా కలిసి ఉన్నారనడికి ఇదే నిదర్శనం. హిందు సోదరుల నుంచి నాకు ఎక్కడా పక్షపాతం ఎదురవలేదు. మరో మతం వాడన్నట్టుగా నన్ను ఎప్పుడూ ట్రీట్ చేయలేదు. వారు నాకు మద్దతు ఇచ్చారు. నా విజయంలో తోడు నిలిచారు’ అని అన్సారీ తెలిపారు.

Also Read: మహారాష్ట్రలోని అకోలాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. 144 సెక్షన్ విధించిన పోలీసులు.. 120 మందిపై కేసులు

హిందు ప్రాబల్య వార్డులో పోటీ చేయడానికి ఆలోచించారా? అని అడగ్గా.. ‘నేను ఈ ప్రాంత వాసినే. నాకు తెలిసినంత వరకు మా పూర్వీకులు 200 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నారు. నేను పోటీ చేయాలనే కాంక్షను వెల్లడించినప్పుడు నా హిందూ మిత్రులు హృదయపూర్వకంగా సపోర్ట్ చేశారు. ప్రోత్సహించారు’ అని అన్సారీ చెప్పారు.

అదే వార్డుకు చెందిన అనూప్ కుమార్ మాట్లాడుతూ.. ‘బయటి వారు అయోధ్య అంటే అక్కడ ముస్లింలు ఉంటారా? అనే ఆలోచనల్లో ఉండవచ్చు. కానీ, వారు ఇప్పుడు చూడవచ్చు. ఇక్కడ ముస్లింలు ఉంటారు. వారు ఎన్నికల్లో గెలుస్తారు కూడా’ అని అన్నారు.

అయోధ్యకు చెందిన వ్యాపారి సౌరభ్ సింగ్ మాట్లాడుతూ.. ‘రామ మందిర విషయమై అయోధ్య ప్రపంచానికి తెలిసింది. ఈ పట్టణం హిందువులకు ఎంత పవిత్ర మైనదో ముస్లిం లకూ అంతే పవిత్రమైనది. ఇక్కడ శతాబ్దాలకు పూర్వమైన ముస్లిం సూఫీల సమాధులు మీకు కనిపిస్తాయి. వందల సంవత్సరాల వారి గుర్తులూ ఉంటాయి’ అని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios