భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణశాఖ కీలక సమావేశం నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీడీఎస్ తో పాటు ముగ్గురు సైనికాధిపతులతో సమావేశమయ్యారు. సైనికాధిపతులు యుద్ధ దుస్తుల్లో కనిపించారు. 

India Pakistan War: ఆపరేషన్ సిందూర్ ద్వారా కేవలం ఉగ్రమూకల పని పట్టాలన్నదే భారత లక్ష్యం... కానీ పాకిస్థాన్ అనవసరంగా నిప్పుతో చెలగాటం ఆడింది. ఉగ్రవాదులేదో తమ దేశాన్ని ఉద్దరించే సమరయోధులు అనుకున్నారో ఏమో... వారిపై దాడిచేసినందుకు పాక్ ఆర్మీ భారత్ పై దాడలకు దిగింది. ఇంకేముంది పాక్ దాడులను తిప్పికొట్టిన భారత్ ప్రతిదాడులకు దిగడంతో దిక్కుతోచని పరిస్థితిలో పాక్ ఉంది. ఏకంగా ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇండియన్ ఆర్మీ దాడులకు భయపడి బంకర్ లో దాక్కున్నాడంటేనే అర్ధం చేసుకోవచ్చు... భారత్ దెబ్బ మామూలుగా లేదని. 

ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిణామాలు, గత రాత్రి జరిగిన ఇండియా-పాక్ దాడులపై చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాల అధినేతలతో భేటీ అయ్యారు. ఇవాళ (శుక్రవారం) సౌత్ బ్లాక్‌లోని కార్యాలయంలో సీడీఎస్, ముగ్గురు సైనికాధిపతులతో 2 గంటల పాటు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు రక్షణమంత్రి. అయితే ఈ సమావేశం నుండి వెలువడిన చిత్రం చాలా విషయాలు చెబుతోంది.

ఆర్మీ దుస్తుల్లో కనిపించిన ముగ్గురు సైనికాధిపతులు

రక్షణ మంత్రితో జరిగిన సమావేశంలో ముగ్గురు సైనికాధిపతులు యుద్ధ దుస్తుల్లో నవ్వుతూ కనిపించారు. సౌత్ బ్లాక్‌లో ఈ దుస్తుల్లో నవ్వుతూ కనిపించడం అంటే మనం ఇప్పటివరకు పాకిస్తాన్‌కు తగిన ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పకనే చెప్పారన్నమాట. అలాగే భవిష్యత్తులో కూడా పాకిస్థాన్ ఏదయినా దుస్సాహసానికి పాల్పడితే పూర్తి శక్తితో ప్రతిఘటించబోతున్నామని వార్నింగ్ ఇచ్చేలా ఉంది ఈ ఫోటో. 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో పాటు సీడీఎస్, ముగ్గురు సైనికాధిపతుల నవ్వుతున్న ముఖాలు మన సైన్యం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూర్ మరియు తర్వాత జరిపిన అన్ని దాడుల్లో విజయానికి సంకేతంగా ఉంది. శత్రువులను ప్రతిసారి దుమ్ము దులిపేస్తూ మోకాళ్లపైకి తెచ్చిందని తెలియజేస్తున్నాయి. సౌత్ బ్లాక్‌లో సైనికాధిపతుల అధికారిక యూనిఫాంలో వెలువడిన చిత్రం భారత సైన్యాలు శత్రువుకు ప్రతిస్పందించడానికి 24 గంటలు సిద్ధంగా ఉన్నాయని కూడా తెలియజేస్తుంది.

పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లన్నీ విజయవంతం

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్ మరియు ముగ్గురు సైనికాధిపతుల నవ్వుతున్న ఈ ఫోటో మన సైన్యాలు పాకిస్తాన్ శత్రువుకు వ్యతిరేకంగా ఇప్పటివరకు చేపట్టిన ఆపరేషన్లన్నీ విజయవంతమయ్యాయని చెబుతోంది. ఈ సమావేశంలో సైనికాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, వైమానిక దళ అధిపతి మార్షల్ ఏపీ సింగ్ మరియు సీడీఎస్ అనిల్ చౌహాన్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తాజా పరిస్థితుల గురించి సమాచారం అందించారు.