unemployment: దేశంలో ఇటీవ‌లే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన క‌రోనా కొత్త వేరియంట్ ఎక్స్ ఈ వెలుగుచూసింది. అయితే, దీని కంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపైనే అధిక ఆందోళనక‌రంగా ప్ర‌జ‌లు ఉన్నార‌ని తాజాగా ఓ స‌ర్వేలో వెల్ల‌డైంది.  

Inflation-unemployment : తీవ్ర సంక్షోభాన్ని సృష్టించి.. కోట్లాది మంది ప్రాణాలు బ‌లిగొన్న క‌రోనా వైరస్ మ‌హ‌మ్మారి రోజురోజుకూ త‌న రూపు మార్చుకుంటూ.. కొత్త వేరియంట్ల రూపంలో మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. ఇటీవ‌లే ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్ బీఏ.ఈ కంటే అత్యంత ప్ర‌మాద‌, వేగంగా వ్యాపించే వేరియంట్ గా భావిస్తున్న ఎక్స్ఈ వేరియంట్ కేసు కూడా భార‌త్ లో న‌మోదైంది. అయితే, ప్రాణాంత‌కంగా మారుతున్న క‌రోనా వైరస్ క్రమం కంటే దేశ ప్ర‌జ‌లు నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపైనే ఎక్కువ ఆందోళ‌న‌క‌రంగా ఉన్నార‌ని తాజాగా ఓ స‌ర్వేలో వెల్ల‌డైంది. 

వివ‌రాల్లోకెళ్తే.. గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఐఏఎన్ఎస్ కోసం సీవోటర్ నిర్వహించిన సమగ్ర సర్వేలో.. క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ల కంటే దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగంపైనే భార‌తీయులు అధికంగా ఆందోళ‌న చెందుతున్నార‌ని వెల్లడైంది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్‌.. ఒమిక్రాన్ హైబ్రిడ్ గా ప‌రిగ‌ణిస్తున్న మొద‌టి కేసు గుర్తించిన వెంట‌నే నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. క‌రోనా మ‌హ‌మ్మారి కొత్త వేరియంట్ల కంటే దేశంలో ఉపాధి త‌గ్గుతుండ‌టం, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు, ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌డం, నిరుద్యోగం వంటి అంశాల‌పై భార‌తీయులు ఆందోళ‌న‌క‌రంగా ఉన్నారు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కొత్త వేరియంట్‌ల నుండి ఉత్పన్నమయ్యే ఏదైనా సంక్షోభ పరిస్థితిని నిర్వహించడానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని నమ్ముతున్నందున ఇప్పుడు తక్కువ మంది కొత్త వేరియంట్‌ల పట్ల భయపడుతున్నారని ఈ స‌ర్వే నివేదిక‌ వెల్లడించింది.

స‌ర్వేలో భాగమైన వారిలో 49.3 శాతం మంది ద్రవ్యోల్బణం, నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల పెరుగుద‌ల‌, నిరుద్యోగం, ఇంధ‌న ధ‌ర‌లు గ‌రిష్టానికి చేరుకోవ‌డం, రోజువారీ వినియోగ వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ప‌రిస్థితుల‌పై ప్ర‌ధాన‌మైన ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని ఈ నివేదిక పేర్కొంది. సర్వేలో భాగంగా ఇంటర్వ్యూ చేసిన వారిలో మొత్తం 27 శాతం మంది నిరుద్యోగం తమకు అతిపెద్ద సమస్య అని చెప్పగా, 14.3 శాతం మంది మాత్రమే కొత్త కరోనావైరస్ వేరియంట్ తమ అతిపెద్ద ఆందోళన కాబట్టి పరిస్థితి ప్రమాదకరంగా మారిందని చెప్పారు. అలాగే, మ‌రో 52 శాతం మంది - ప్రాణాంతక వైరస్ కొత్త వేరియంట్ వార్తలు ఇకపై తమను భయపెట్టవని చెప్పగా, 30.4 శాతం మంది కొత్త వేరియంట్‌ను గుర్తించడం గురించి ఆందోళన చెందుతున్నారని చెప్పారు.

ప్రాణాంతక క‌రోనా వైరస్ భయాన్ని ప్రజలు అధిగమించడానికి గల కారణాన్ని కూడా సర్వే వెల్లడించింది. సర్వేలో, 38 శాతం మంది.. కరోనావైరస్ కొత్త వేరియంట్ నుండి ఉత్పన్నమయ్యే ఏదైనా సంక్షోభ పరిస్థితిని నిర్వహించడానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని తాము నమ్ముతున్నామని చెప్పారు. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం కొంతమేరకు ఏర్పాట్లు చేసిందని 17.1 శాతం మంది చెప్పగా, 32.7 శాతం మంది భిన్నంగా అభిప్రాయపడ్డారు.. అటువంటి పరిస్థితిని ఎదుర్కోవటానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేదని అన్నారు. కాగా, ప్రస్తుతం దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా వంట నూనెలు, గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలపై ఆర్థక భారం మరింతగా పెరిగింది.