భారత పోస్టల్ శాఖ రూపొందించిన డిజిపిన్‌తో ఇంటి స్థానం స్పష్టంగా గుర్తించొచ్చు. ప్రతి 4 మీటర్ల గ్రిడ్‌కు ప్రత్యేక కోడ్‌ను కేటాయిస్తారు.

పిన్‌కోడ్ (Pin Code) రాయడం లేకుండా చిరునామా పూర్తికాదని మనందరికీ తెలుసు. కానీ ఒకే పిన్‌కోడ్ పరిధిలో ఎన్నో ఇళ్లుంటాయి. దీంతో కచ్చితమైన స్థలాన్ని గుర్తించడంలో ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో ఇది మరింత కష్టంగా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం డిజిపిన్ (Digipin) అనే డిజిటల్ చిరునామా వ్యవస్థను తీసుకొచ్చింది.

10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్…

డిజిపిన్ అనేది 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ఇది మీరు ఉన్న ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా ప్రతి 4 మీటర్ల స్థలాన్ని గ్రీడ్‌లుగా విభజించి, ప్రతి గ్రీడ్‌కు ప్రత్యేక కోడ్ కేటాయిస్తారు. ఈ కోడ్ ద్వారా మీ ఇంటి స్థానం స్పష్టంగా గుర్తించడం జరుగుతుంది.

అంబులెన్స్, అగ్నిమాపక సేవలు…

ఈ డిజిటల్ అడ్రస్ వ్యవస్థను ఐఐటీ హైదరాబాద్, ఇస్రో (ISRO), ఎన్‌ఆర్‌ఎస్‌సీ సహకారంతో భారత పోస్టల్ శాఖ రూపొందించింది. ఇది ఓపెన్ సోర్స్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించడం జరిగింది.విస్తృతంగా చిరునామాలు లేని ప్రాంతాల్లో – ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో – అంబులెన్స్, అగ్నిమాపక సేవల కోసం డిజిపిన్ ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలతో ఈ కోడ్‌ను పంచుకోవచ్చు.

చిరునామాతో కలిపి..

డిజిపిన్‌ను పోస్ట్ డిపార్ట్‌మెంట్ రూపొందించిన వెబ్‌పోర్టల్‌ లేదా యాప్‌ ద్వారా పొందొచ్చు. అక్కడ మీరు మేకిచిన స్థలంపై ట్యాప్ చేస్తే వెంటనే డిజిపిన్ కోడ్ కనిపిస్తుంది. ఆ కోడ్‌ను మీరు మీ చిరునామాతో కలిపి ఉపయోగించొచ్చు.

ఇది ప్రస్తుత చిరునామాను మార్చదు కానీ అదనంగా మరింత స్పష్టతనిచ్చే డిజిటల్ అడ్రస్‌గా పనిచేస్తుంది. భవిష్యత్తులో జీఐఎస్ వ్యవస్థలతో ఇది ఏకీకృతమైతే, చిరునామాల అవశ్యకతే తగ్గిపోవచ్చు.