ఇండోనేషియాలోని బాలీలో మంగళవారం భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్, ఇండోనేషియాలు భాగస్వామ్య వారసత్వం, సంస్కృతితో అనుసంధానించబడి ఉన్నాయని పేర్కొన్నారు. మంచి,చెడు సమయాల్లోనూ ఇరు దేశాలు సహచరులని, సవాలు సమయాల్లో ఇండోనేషియాతో భారతదేశం దృఢంగా నిలిచిందని నొక్కి చెప్పారు.
ఇండోనేషియాలో ప్రధాని మోదీ: జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా రాజధాని బాలి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాలీలోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారతదేశం,ఇండోనేషియాలు వారసత్వం, సంస్కృతితో అనుసంధానించబడి ఉన్నాయని అన్నారు. భారతదేశంలో హిమాలయాలు ఉంటే, బాలిలో అగుంగ్ పర్వతం ఉందని ప్రధాని అన్నారు. భారతదేశంలో గంగ ఉంటే, బాలిలో తీర్థ గంగ ఉందని.. ఇలా ప్రతి విషయంలో సారూప్యతలు ఉన్నాయని అన్నారు.
ఇండోనేషియా,భారతదేశం మధ్య బలమైన సంబంధాలను ఉన్నాయనీ, భారతదేశంలో గొప్ప రామాలయం రూపుదిద్దుకుంటున్న తరుణంలో..ఇండోనేషియాలోని రామాయణ సంప్రదాయాన్ని గర్వంగా గుర్తుచేసుకుంటున్నామని అన్నారు. భారతదేశం సాధించిన విజయాలపై మోడీ మాట్లాడుతూ.. నేటి భారతదేశం అపూర్వమైన స్థాయిలో నిలిచిందనీ, ప్రణాళిక బద్దంగా వేగంతో పని చేస్తోందని అన్నారు. 21వ శతాబ్దంలో భారతదేశం ప్రపంచానికి ఆశాకిరణమని ప్రధాని అన్నారు. 2018లో ఇండోనేషియాలో ఇంత పెద్ద భూకంపం వచ్చినప్పుడు వెంటనే ఆపరేషన్ సముద్ర మైత్రిని ప్రారంభించానని ప్రధాని మోదీ అన్నారు.నేడు ప్రపంచం మొత్తం పర్యావరణ అనుకూలమైన, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ వైపు ఆకర్షితులవుతున్నప్పుడు, భారతదేశ యోగా, ఆయుర్వేదాన్ని ఓ బహుమతిగా అందించిందని ప్రధాని అన్నారు.
సముద్రంలోని భారీ అలలు భారత్, ఇండోనేషియా మధ్య సంబంధాలను ఉత్సాహంతో, సజీవంగా ఉంచాయని ప్రధాని అన్నారు. భారతదేశంలోని ఒడిశాలో బలి జాత్రా ఉత్సవం అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఇండోనేషియా పద్మ అవార్డు గ్రహీతల గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు.ఇండోనేషియాకు చెందిన బప్పా నుమాన్ నుఅర్తాను భారతదేశం పద్మశ్రీతో సత్కరించిన సంగతి తనకు గుర్తుందని ప్రధాని అన్నారు. ఇండోనేషియాకు చెందిన వాయాండివ్య, అగస్ ఇంద్ర ఉదయన్ జీ పద్మ సమ్మాన్ పొందినప్పుడు..వారి గురించి చాలా తెలుసుకునే అవకాశం తనకు లభించిందని అన్నారు.
భారత్‌లో వచ్చిన మార్పుల గురించి ఎన్నారైలకు తెలియజేస్తూ..2014కి ముందు, 2014 తర్వాత భారత్‌లో స్పీడ్ అండ్ స్కేల్‌లో భారీ వ్యత్యాసం ఉందని ప్రధాని మోదీ అన్నారు. నేడు భారతదేశం అత్యంత వేగంతో పని చేస్తోంది.పలు రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలిచింది.భారతదేశం ప్రతిభ, సాంకేతికత, ఆవిష్కరణలు మరియు భారతదేశ పరిశ్రమలు ప్రపంచంలో తమదైన ముద్ర వేసుకున్నాయని ప్రధాన మంత్రి అన్నారు.
రక్షణ రంగంలో భారతదేశం దశాబ్దాలుగా దిగుమతులపై ఆధారపడి ఉందని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని అన్నారు. భారత్ రక్షణ రంగంలో సామర్థ్యాలను రోజురోజుకు పెంచుకుంటుంది.
బ్రహ్మోస్ క్షిపణి అయినా, తేజస్ యుద్ధవిమానమైనా, భారత దేశ రక్షణ సామర్ధానికి ప్రపంచదేశాలు సలాం చేస్తున్నాయని అన్నారు. ఒకప్పుడు కళింగ, మేడాంగ్ వంటి రాజ్యాల ద్వారా భారత దార్శనికత, సంస్కృతి ఇండోనేషియాకు చేరాయని మోదీ అన్నారు. 21వ శతాబ్దంలో అభివృద్ధి కోసం భారత్ ఇండోనేషియాలు
పరస్పరం కలిసి పనిచేసే సమయం వచ్చిందని అన్నారు.
కోవిడ్ సమయంలో భారతదేశం ప్రతి విషయంలోనూ స్వయం ప్రతిపత్తిని అవలంబించిందని ప్రధాని అన్నారు. ఔషధాల నుండి వ్యాక్సిన్ల వరకు ప్రపంచ దేశాలకు సహాయం అందించమనీ, భారతదేశం అనేక దేశాలకు రక్షణ కవచంగా పనిచేసిందని అన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో.. భారతదేశం వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనే మంత్రాన్ని అందించిందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు భారత్ వన్ ఎర్త్ కార్యక్రమాన్ని ప్రారంభించిందనీ, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి భారతదేశం మిషన్ లైఫ్ యొక్క పరిష్కారాన్ని అందించిందని అన్నారు. 21వ శతాబ్దంలో భారత్ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుందనీ, ఆ లక్ష్యాలను సాధించేందుకు భారతదేశం అంకితభావంతో పని చేస్తోందని అన్నారు.
