ఇరాన్, ఇజ్రాయెల్‌ల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త ప‌రిస్థితుల‌తో ప‌రిస్థితులు వేగంగా మారుతున్నాయి. హార్ముజ్ జ‌ల సంధిని మూసివేస్తార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో భార‌త్‌లో చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయని వార్తలు వ‌స్తున్నాయి.  

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత ప్రభుత్వ చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఒక కీలక ప్రకటన చేశారు. భారత్‌కు ఇప్పటివరకు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ఇప్పటికీ పలు మార్గాల ద్వారా చమురు, వాయువు సరఫరా కొనసాగుతుందన్నారు.

హార్ముజ్ జలసంధి మీద ఆధారపడటం తగ్గించాం

ఈ విష‌య‌మై మంత్రి ఎక్స్ వేదిక‌గా ఓ ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా భారత్‌ చమురు దిగుమతులను విభిన్న దేశాల నుంచి పొందేలా మార్పులు చేసుకుందని పేర్కొన్నారు. "ప్రధాని మోదీ గారి నేతృత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా సరఫరా మార్గాలను విస్తృతం చేశాం. ఇప్పుడు పెద్ద మొత్తంలో చమురు సరఫరా హార్ముజ్ జలసంధి మీద ఆధారపడడం లేదు" అని ఆయన పేర్కొన్నారు.

హార్ముజ్ జలసంధి ద్వారా భారత దిగుమతులలో రోజుకి సుమారు 20 లక్షల బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ వస్తోంది. ఇది మొత్తం దిగుమతుల్లో 5.5 మిలియన్ బ్యారెల్స్‌లో 2 మిలియన్ బ్యారెల్స్ అన్నమాట.

ప్రస్తుతం భారత్‌కు చమురు సరఫరాలో రష్యా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ చమురు సరఫరా హార్ముజ్ జలసంధిపై ఆధారపడకుండా స్వెజ్ కాలువ, కేప్ ఆఫ్ గుడ్ హోప్, పసిఫిక్ సముద్రం మార్గంగా వస్తోంది. అదే విధంగా, అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి వచ్చే చమురు కూడా భారత్‌కు ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది వీటి ధరలు కొద్దిగా ఎక్కువైనా సరే, అవసరానికి ఉపయోగపడతాయి.

ఇదిలా ఉంటే ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు USD 77 దాటింది. అయినా కూడా, గత ఏడాది ఇదే సమయంలో కన్నా చమురు ధరలు ఇప్పటికీ 10% తక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

గ్యాస్ అవసరాలకూ సమృద్ధిగా సరఫరా ఉంది

భారతానికి గ్యాస్ అవసరాలలో సుమారు 50% వరకు మధ్యప్రాచ్య దేశాల నుంచి వస్తోంది. ఖ‌తార్ దేశం భారతానికి అతిపెద్ద నేచురల్ గ్యాస్ సరఫరాదారు. ఈ గ్యాస్ వాడకం విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ, సిఎన్జీ వాహనాల కోసం, గృహ వినియోగం వంటి వాటికి ఉపయోగపడుతుంది.

ఇంధన సరఫరాలో అంతరాయం ఉండదు

"మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వద్ద ఇప్పుడు కూడా పలు వారాల వరకు సరిపడే ఇంధన నిల్వలు ఉన్నాయి. ప్రజలకు ఇంధన సరఫరా నిలిపే పరిస్థితి రావద్దని మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం" అని మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు.

ఈ సమయంలో భారత్ వ్యూహాత్మకంగా కొన్ని నిర్ణ‌యాలు తీసుకుంది. వీటిలో ప్ర‌ధానంగా రష్యా వంటి దేశాలపై ఆధారపడటం, కొత్త సరఫరా మార్గాలను రూపొందించడం వంటివి దేశానికి ఇంధన పరంగా భద్రత కల్పిస్తున్నాయి.