2019లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హాసీనాకు ఇచ్చిన మాటను భారత్ నిలబెట్టుకుంది. దీనిలో భాగంగా ఆ దేశానికి 20 బ్రాడ్ గేజ్ డీజిల్ లోకోమోటివ్‌లను బహుమతిగా అందించింది.  20 బ్రాడ్‌గేజ్ డీజిల్ లోకో ఇంజిన్లు పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని గెడే జంక్షన్ నుంచి ప్రారంభించారు.

పర్యాటకం, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా బంగ్లాదేశ్‌కు భారత్ మంగళవారం 20 బ్రాడ్‌గేజ్ లోకోమోటివ్‌లను అందించింది. ఈ మేరకు ఢాకాకు వెళ్లే డీజిల్ లోకో ఇంజిన్‌లను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. తద్వారా 2019లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఇచ్చిన హామీని భారత ప్రభుత్వం నిలబెట్టుకుందని పేర్కొంది. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య సరిహద్దులో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడంలో , బలోపేతం చేయడంలో భారతీయ రైల్వే కీలకపాత్ర పోషిస్తుందన్నారు. 20 బ్రాడ్‌గేజ్ డీజిల్ లోకో ఇంజిన్లు పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని గెడే జంక్షన్ నుంచి ప్రారంభించారు.

రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఒక్కో ఇంజిన్ 3,300 హార్స్ పవర్ కలిగి వుంటుంది. ఈ ఇంజిన్‌లు భారత్, బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న ప్రయాణీకులు, సరుకు రవాణా రైళ్లకు అనుకూలంగా వుంటాయని జనరల్ మేనేజర్ ద్వివేది తెలిపారు. గతేడాది కార్గో మార్పిడిలో గణనీయమైన వృద్ధి నివేదించిన నేపథ్యంలో ఇది రెండు వైపులా ఒక వరం వంటిదన్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో భారత్ నుంచి బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాలకు రైళ్ల ద్వారా 2.66 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయబడింది. మొత్తం 100 కార్గో రైళ్లు ఈ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు రైల్వే శాఖ తెలిపింది. 

గతంలోనూ భారత్.. బంగ్లాదేశ్‌కు 10 రైల్వే ఇంజిన్‌లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం భారత ప్రభుత్వం ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌కు 30 రైల్వే ఇంజిన్‌లను బహుమతిగా ఇచ్చింది. ఇక ప్యాసింజర్ రైళ్ల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు మూడు జతల రైళ్లు నడుస్తున్నాయి. అవి కోల్‌కతా-ఖుల్నా బంధన్ ఎక్స్‌ప్రెస్, కోల్‌కతా-ఢాకా మైత్రీ ఎక్స్‌ప్రెస్ , న్యూ జల్పైగురి-ఢాకా మిటాలి ఎక్స్‌ప్రెస్.

Scroll to load tweet…