తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను (Afghanistan) స్వాధీనం చేసుకోవడంతో.. అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా భారత ప్రభుత్వం ఆపరేషన్ దేవి శక్తి (Operation Devi Shakti) మిషన్‌లో భాగంగా 104 మందిని ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఢిల్లీకి చేర్చింది.
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను (Afghanistan) స్వాధీనం చేసుకోవడంతో.. అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే. అమెరికా మిత్రదేశాల సైన్యం ఆఫ్ఘనిస్థాన్‌ను వీడకముందే చాలా దేశాలు.. అక్కడి నుంచి తమవారిని స్వస్థలాలకు చేర్చే ప్రక్రియ చేపట్టాయి. ఈ క్రమంలోనే భారత్ కూడా ఆపరేషన్ దేవి శక్తి (Operation Devi Shakti) పేరుతో ఆఫ్ఘనిస్థాన్ ఉన్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియన చేపట్టింది. అయితే అయినప్పటికీ.. కొందరు అక్కడే చిక్కుకుపోయారు. అయితే తాజాగా మరోసారి ఆపరేషన్ దేవి శక్తి మిషన్‌లో భాగంగా 104 మందిని ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్‌కు చేర్చింది. వీరిలో 94 మంది ఆఫ్ఘన్లు, 10 మంది భారతీయులు ఉన్నారు. డిసెంబర్ 10న ఈ ప్రత్యేక విమానం (special flight) ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
ఇందుకు సంబంధించిన వివరాలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి (Arindam Bagchi) ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఆపరేషన్ దేవి శక్తి కింద భారతదేశం ఏర్పాటు చేసిన ప్రత్యేక కామ్ ఎయిర్ విమానం కాబూల్ నుంచి న్యూఢిల్లీకి చేరుకుంది. ఇది అక్కడి హిందూ, సిక్కు మైనారిటీ సభ్యులతో కలిపి 94 మంది ఆఫ్ఘన్‌లను, 10 మంది బారతీయులను తీసుకవచ్చింది. తరలించినవారిలో 9 మంది చిన్నారులు ఉండగా.. అందులో ముగ్గురు శిశువులు ఉన్నారు’ అని ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీకి తరలించిన ఆఫ్ఘనిస్తాన్‌లోని మైనారిటీ సంఘాల వారు తమతో పాటు సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ (Guru Granth Sahib) రెండు కాపీలు, కొన్ని పురాతన చేతి రాతతో కూడి హిందూ గ్రంథాలను తీసుకొచ్చారు.
అయితే ఆఫ్ఘనిస్థాన్ నుంచి ప్రజలను తరలించడానికి ఢిల్లీకి వచ్చిన ప్రత్యేక విమానంలో.. భారత ప్రభుత్వం తిరిగి అక్కడికి వైద్య సామాగ్రిని పంపింది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్టా.. మానవతా సహాయాన్ని అందజేసింది. ప్రత్యేక విమానంలో పంపిన వైద్య సామాగ్రిని అక్కడ ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులకు అందజేస్తారు. వీరు వాటిని కాబూల్‌లోని ఇందిరా గాంధీ పిల్లల ఆస్పత్రిలో అందుబాటులో ఉండేలా చూస్తారు.
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకన్నప్పటి నుంచి భారత్ ఆపరేషన్ దేవి శక్తి కింద భారత ప్రభుత్వం.. ఇప్పటివరకు 669 మంది ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్‌కు తరలించింది. అందులో 448 మంది భారతీయులు ఉండగా 206 మంది ఆఫ్ఘన్‌లు ఉన్నారు. భారత్‌కు తరలించిన ఆఫ్ఘన్‌లలో మెజారిటీ.. అక్కడి హిందూ, సిక్కు మైనారిటీ కమ్యూనిటీలకు చెందినవారే.
కాబూల్ నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రత్యేక విమానంలో ఆఫ్ఘన్‌లోని సిక్కులు, హిందూలు తీసుకొచ్చిన పవిత్ర మత గ్రంథాలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వీకరించారు. ఈ మేరకు వారు ట్విట్టర్‌లో పోస్టులు చేశారు. వాటిని స్వీకరించినందుకు తాము ఆశీర్వాదంగా భావిస్తున్నట్టుగా చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం మత, సాంస్కృతిక, సామాజిక రక్షణకు పూర్తిగా కట్టుబడి ఉంది.
