కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

అమెరికా, ఫ్రాన్స్ దేశాలతో భారత్ కీలక ఒప్పందం చేసుకుంది. ఒప్పందం కుదిరిన దేశాలు తమ విమాన సర్వీసులను నడపనున్నాయి. శుక్రవారం నుంచే ఈ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.

ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ జూలై 17 నుంచి 31 మధ్య 18 విమానాలను నడపనుంది. ఎయిర్‌ఫ్రాన్స్ సైతం జూలై 18 నుంచి ఆగస్టు 1 మధ్య 28 విమానాలను నడపనుందని పురి వెల్లడించారు. ఢిల్లీ- న్యూయార్క్ మధ్య ప్రతిరోజూ , ఢిల్లీ- శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య వారానికి మూడు రోజుల పాటు విమానాలు నడవనున్నాయని ఆయన చెప్పారు.

ఈ తరహా ఒప్పందానికి ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ, ఆచితూచి అడుగులు వేస్తున్నామని పురి తెలిపారు. కాగా కోవిడ్ కారణంగా దేశంలో మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.