రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు భారత్‌కు కలిసి రానున్నాయా? ఈ ఆంక్షలను తప్పించుకోవడానికి రష్యా ప్రభుత్వం చౌక ధరలకే ముడి చమురు, ఇతర సరుకులను దాని మిత్ర దేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు భారత్‌కు ఆఫర్ కూడా అందింది. ఈ ఆఫర్‌ను భారత్ హ్యాపీగా స్వీకరించాలని యోచిస్తున్నది. తద్వార దేశీయంగా పెరుగుతున్న ఇంధన ధరలకు కళ్లెం వేయాలని ప్రయత్నిస్తున్నట్టు కొందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తెలిపారు. అయితే, రూపీ(భారత కరెన్సీ), రూబుల్(రష్యా కరెన్సీ)ల మధ్య ట్రాన్సాక్షన్ మెకానిజం పనులు జరుగుతున్నాయని, అవి పూర్తయ్యాక రష్యా నుంచి చౌక ధరలకే చమురు దిగుమతి భారత్ దిగుమతి చేసుకుంటుందని తెలుస్తున్నది.

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేయడంతో దాన్ని నిలువరించడానికి అమెరికా, పశ్చిమ దేశాలు కఠిన ఆంక్షలు అమలు ప్రకటించాయి. కొన్ని దేశాలు ఏకంగా రష్యా నుంచి చమురునూ దిగుమతి చేసుకోబోమని స్పష్టం చేశాయి. అలా చేస్తే పశ్చిమ దేశాలకే నష్టం అని రష్యా వార్నింగ్ ఇచ్చింది కూడా. అయినా అవి వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ దేశాల ఆంక్షలను తట్టుకుని నిలబడటానికి, తమ ఎగుమతులను ఇతర దేశాలకు మళ్లించే యోచనలో రష్యా ఉన్నది. తమ ఆంక్షల నుంచి రష్యా తప్పించుకోవడానికి ఇతర దేశాలు సహకరించరాదని పశ్చిమ దేశాలు ఓ అల్టిమేటం పెట్టాయి. దీంతో రష్యా ప్రభుత్వం కొన్ని ఆఫర్‌లను జోడించి దాని ఎగుమతులను మిత్ర దేశాలకు మళ్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అది మిత్రదేశాలను సంప్రదించినట్టూ సమాచారం. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వవర్గాలూ స్పందించాయి.

రష్యా ప్రభుత్వం భారీ డిస్కౌంట్లతో ముడి చమురు, ఇతర సరుకులను విక్రయించే ఆఫర్ ఇచ్చిందని ఇండియా అధికారవర్గాలు తెలిపాయి. చెల్లింపులకూ రూపీ, రూబుల్ మెకానిజం లావాదేవీలు నెరిపే వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించాయి. ప్రభుత్వం కూడా అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొన్నాయి. ఈ ఆఫర్‌ను స్వీకరించడానికి తాము సంతోషంగా ఎదురుచూస్తున్నామని వివరించాయి. అయితే, తమకు ఈ ఇందులో ట్యాంకర్లు, ఇన్సూరెన్స్ కవర్, ఆయిల్ బ్లెండ్ వంటి కొన్ని అవాంతరాలు ఉన్నాయని తెలిపాయి. వాటిపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దిగుమతులు ప్రారంభిస్తామని వివరించాయి. 

కాగా, కొన్ని దేశాలు రష్యా ఇచ్చే ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నాయి. పశ్చిమ దేశాలు, అమెరికా విధించిన ఆంక్షల ఉచ్చులో తామూ చిక్కుకునే ముప్పు ఉన్నదని అవి భావిస్తున్నాయి. కానీ, రష్యా నుంచి చౌకగా లభించే ముడి చమురును కొనుగోలు చేయడంలో భారత్‌ను ఏ ఆంక్షలు అడ్డుకోలేవని ఆ అధికారవర్గాలు స్పష్టం చేశాయి. చెల్లింపుల కోసం రూపీ-రూబుల్ మెకానిజం పనులు సాగుతున్నాయని, ఇది పూర్తయితే, చమురు, ఇతర సరుకులను తక్కువ ధరలకే రష్యా నుంచి పొందుతామని తెలిపాయి. రష్యా, బెలారస్ నుంచి చమురుతోపాటు ఇతర సరుకులను చౌక ధరలకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ముఖ్యంగా వ్యవసాయ సంబంధ ఎరువులపై సబ్సిడీలు కేంద్రానికి భారంగా మారింది. దీంతో వీటిని పూడ్చుకోవడానికి ఈ రెండు దేశాల నుంచి అవసరమైన ముడి సరుకులను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.

తమతో వాణిజ్య సంబంధాలను ఎప్పట్లాగే కొనసాగించాలని, అవసరమైతే పెంచుకోవాలని రష్యా ప్రభుత్వం ఇటీవలే దాని మిత్ర దేశాలకు పిలుపు ఇచ్చింది. రక్షణ, ఆయుధ కొనుగోళ్లలో రష్యాతో భారత్ ఎంతో దీర్ఘమైన సంబంధాలను కలిగి ఉన్నది. అదీగాకుండా, ఉక్రెయిన్‌పై దాడి చేసిన రష్యాను ఖండించే తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌ సమర్థించలేదు. ఈ తీర్మానానికి దూరంగా ఉంది. కానీ, వెంటనే హింసకు ఫుల్ స్టాప్ పెట్టాలని భారత్ సూచించింది.

భారత్ దాని చమురు అవసరాల్లో 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. అందులో సాధారణంగా రెండు నుంచి మూడు శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. కానీ, ఈ ఏడాది చమురు ధరలు సుమారు 40 శాతం పెరగడంతో చౌకగా లభించే చమురు కోసం భారత్ చూస్తున్నది. రష్యా కూడా దాని మిత్రదేశాలపై ఆంక్షలు పడకుండా ఈ ఎగుమతులకు చెల్లింపులు జరిగేలా చూస్తున్నది. రష్యాకు చెందిన సుర్గుట్‌నెఫ్టెగ్యాజ్ చైనా బయ్యర్‌ను లెటర్ ఆఫ్ క్రెడిట్ పేమెంట్ గ్యారంటీ లేకుండానే కొనుగోలు చేసుకోవడానికి అనుమతించింది.