న్యూఢిల్లీ: గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలతో చోటు చేసుకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాలకు చెందిన కమాండర్ స్థాయి అధికారుల చర్చలు ఫలప్రదమయ్యాయి.

ఈ నెల 15వ తేదీన గాల్వన్ లోయలో ఇండియా చైనా ఆర్మీ మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా  20 మంది మరణించిన విషయం తెలిసిందే.  దీంతో రెండు దేశాల ఆర్మీకి చెందిన కమాండర్ స్థాయి అధికారులు సోమవారం నాడు చర్చించారు.

also read:చైనా-ఇండియా మధ్య ఉద్రిక్తత: కమాండర్ స్థాయి అధికారుల మధ్య చర్చలు

ఈ చర్చలు ఫలప్రదమైనట్టుగా ఆర్మీ ప్రకటించింది.  సామరస్య, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, ఇరు పక్షాల సేనలు వెనక్కితగ్గాలనే అంశంపై ఇరు దేశాలకు చెందిన ఆర్మీ అధికారుల మధ్య చర్చ జరిగింది. 

తూర్పు లడఖ్ తో పాటు రెండు దేశాల మధ్య ఘర్షణలు చోటు చేసుకొనే అవకాశాలు ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడ వెనక్కి వెళ్లేందుకు రెండు దేశాల ఆర్మీ అధికారులు సానుకూలంగా స్పందించారు. 

తమ దేశానికి సరిహద్దున మోహరించిన పిఎల్ఏ బంకర్లు, పిల్ బాక్స్‌లు, ఇతరత్రా వాటిని వెంటనే తొలగించాలని చైనాను ఇండియా డిమాండ్ చేసింది.

గాల్వన్ లోయలో పీఎల్ఏ దళాలను ఉపసంహరించుకోవాలని కూడ డిమాండ్ చేసింది. జూన్ 15వ తేదీన ఘర్షణ జరిగిన ప్రాంతంతో పాటు కీలకమైన  ప్రాంతాల్లో యధాతథ స్థితిని పునరుద్దరించాలని ఇండియా డిమాండ్ చేసింది.11 గంటల పాటు కమాండర్ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరిగాయి.