న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య సరిహద్దు సమస్యలపై ఉద్రిక్తతలు చోటు చేసుకొన్న నేపథ్యంలో సోమవారం నాడు రెండు దేశాలకు చెందిన కమాండర్ స్థాయి అధికారుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.

ఈ నెల 15వ తేదీన తూర్పు లడఖ్ లోని గాల్వన్ లోయలో ఇండియా, చైనా ఆర్మీ మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.  ఈ ఘర్షణ చోటు చేసుకొన్న తర్వాత రెండు దేశాల ఆర్మీ మధ్య  చర్చలు ప్రారంభమయ్యాయి.

also read:భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తత: ధీటుగా బదులివ్వాలని రాజ్‌నాధ్ ఆదేశం

రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో 20 మంది మరణించిన విషయం తెలిసిందే.

రెండు దేశాల మధ్య చోటు చేసుకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు గాను చుషుల్ సమీపంలోని వాస్తవ నియంత్రణ రేఖ వద్ద రెండు దేశాల కమాండర్ స్థాయి అధికారుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.

జూన్ 6వ తేదీన ఇరుపక్షాలకు చెందిన కమాండర్ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఆ చర్చల్లో ఇండియా తరపున కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరపునయ  జనరల్ లియు లిన్ కూడ పాల్గొన్నారు.ఇవాళ జరిగిన చర్చల్లో వీరిద్దరూ కూడ పాల్గొన్నారు.

రెండు దేశాల మధ్య ఇది నాలుగవ రౌండ్ టేబుల్ సమావేశంగా అధికారులు తెలిపారు.ఇవాళ సమావేశంలో ఈ నెల 15వ తేదీన చోటు చేసుకొన్న ఘటనతో పాటు  రెండు దేశాల మధ్య  ఉద్రిక్తతలను నివారించే దిశగా చర్చలను కేంద్రీకరించారు.