Asianet News TeluguAsianet News Telugu

ఇండియా, చైనాల మధ్య 14వ రౌండ్ కమాండర్‌ల స్థాయి సమావేశం... కీలక విషయాలపై కుదిరిన అంగీకారం

భారత్, చైనాల మధ్య 14వ రౌండ్ కమాండర్ల స్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఎల్ఏసీకి చైనా వైపున గల చుషుల్ మోల్డో ఏరియాలో ఈ సమావేశం జరిగినట్టు కేంద్ర రక్షణ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సమావేశంలో ఉభయ దేశాల రక్షణ, విదేశాంగ శాఖలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నట్టు తెలిపింది. ఇందులో సరిహద్దులో శాంతి, సుస్థిరతను నెలకొల్పడానికి ఇరు దేశాల మధ్య కీలక విషయాలపై ఏకాభిప్రాయం కుదిరినట్టు వివరించింది.
 

india china agrees to continueing military diplomatic channels in 14th round commanders meeting
Author
New Delhi, First Published Jan 13, 2022, 10:51 PM IST

న్యూఢిల్లీ: డ్రాగన్ కంట్రీ Chinaతో పంచుకుంటున్న సరిహద్దులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. గాల్వన్ లోయ(Galwan Valley)లో ఘర్షణలు జరిగినప్పటి నుంచి ఈ సరిహద్దులో పరిస్థితులు ఇంకా సున్నితంగానే ఉన్నాయి. మిలిటరీని వెనక్కి తీసుకోవడానికి, సరిహద్దులో శాంతి(Peace), సుస్థిరతను నెలకొల్పడానికి భారత దేశం(India) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. చైనా దేశంలో పలుమార్లు చర్చలు నిర్వహించింది. ఇంకా ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మిలిటరీ, దౌత్య మార్గాల్లో ఈ సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఇరు దేశాల మధ్య కమాండర్ల స్థాయి సమావేశం జరిగింది. ఇది 14వ సమావేశం. ఇందులో ఇరు దేశాల మధ్య కీలక విషయాలపై అంగీకారం కుదిరినట్టు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ(Defence Ministry) ఓ ప్రకటనలో వెల్లడించింది.

బుధవారం ఇరు దేశాల మధ్య కమాండర్ల స్థాయి సమావేశం సరిహద్దుకు చైనా వైపున చుషుల్ మోల్డో ఏరియాలో జరిగింది. ఈ సమావేశంలో ఉభయ దేశాలకు చెందిన రక్షణ, విదేశాంగ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. సరిహద్దు(ఎల్ఏసీ) వెస్ట్రన్ సెక్టార్‌లో నెలకొన్న అస్థిరతను తొలగించడానికి ఇరు దేశాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు ఈ సమావేశంలో వెల్లడించినట్టు కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది. దీనితోపాటు ఇతర సమస్యలనూ వేగంగా పరిష్కారించుకోవడానికి తమ తమ దేశాల నాయకత్వం నిర్దేశించిన మార్గాల్లో ప్రయాణించాలని అంగీకరించినట్టు తెలిపింది. తమ తమ దేశాల నాయకత్వం సలహాలు, సూచనలను శిరసావహించి ఎల్ఏసీలో వెస్ట్రన్ సెక్టార్ ఏరియాలో తిరిగి శాంతి, సుస్థిరతలను నెలకొల్పగలమని పేర్కొన్నట్టు వివరించింది. ఈ విధానంలోనే అక్కడ శాంతి సుస్థిర వాతావరణం నెలకొనడమే కాదు.. ఉభయ దేశాల మధ్య మళ్లీ ద్వైపాక్షిక ప్రక్రియ మొదలు అవుతుందని ఈ సమావేశంలో అభిప్రాయాలు వెల్లడించుకున్నట్టు పేర్కొంది.

ఇది వరకే ఈ సమావేశాల ద్వారా వచ్చిన తీర్మానాలను బలోపేతం చేసుకుని మరిన్ని ప్రభావవంత నిర్ణయాలతో సరిహద్దులో శాంతి నెలకొల్పుకోవాలని ఉభయ దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో అంగీకరించినట్టు రక్షణ శాఖ వెల్లడించింది. ఉభయ దేశాలు మరింత క్లోజ్‌గా అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. మిగిలిన సమస్యలపైనా వేగంగా పరిష్కారాలు తెచ్చుకోవడానికి మిలిటరీ, దౌత్య మార్గాల్లో చర్చ కొనసాగాల్సిందేనని అభిప్రాయపడినట్టు వివరించింది. అంతేకాదు, మరో కమాండర్ల స్థాయి సమావేశం వీలైనంత తొందరగా జరగాలని ఉభయ దేశాల ప్రతినిధులు అంగీకరించినట్టు పేర్కొంది. లడాఖ్ ఏరియాలో మిలిటరీ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణంపై ఉభయ దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటి వరకు కమాండర్ల స్థాయి సమావేశాలు 14 ముగిశాయి.

గతేడాది అక్టోబర్‌లో ఇరు దేశాల నడుమ చుషుల్-మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద చైనా వైపు భూభాగంలో 13వ దఫా చర్చలు జరిగాయి. ప్రధానంగా తూర్పు లద్ధాఖ్ హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలోని పెట్రోలింగ్ పాయింట్ (పీపీ)-15 నుంచి బలగాల ఉపసంహరణ గురించే చర్చించినట్లు తెలిసింది. 

నిరుడు మే నెలలో చోటు చేసుకున్న ఘర్షణ పునరావృతం కాకుండా సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేపట్టాలని, ఇందుకోసం కొత్త ప్రోటోకాల్స్ రూపొందించుకోవాలని ఇరువర్గాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అయితే, దీనిమీద సైన్యం నుంచి అధికారిక ప్రటకన ఏదీ ఇంకా వెలువడలేదు. 

2020 మే 5వ తేదీన తూర్పు లద్దాఖ్ లో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరువైపులా పదుల సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా వివిధ స్థాయిల్లో అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios