Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద స్టాక్‌ మార్కెట్‌గా భారత్

బీఎస్ఈ మరోసారి రికార్డు సాధించింది. మరోసారి హాంకాంగ్ ను వెనక్కి నెట్టింది. 5.17 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద మార్కెట్ గా అవతరించింది  

India become fourth largest stock market in the world
Author
First Published Jun 14, 2024, 6:04 PM IST

భారత స్టాక్ మార్కెట్ మరోసారి రికార్డ్ బ్రేక్ చేసింది. మరోసారి హాంకాంగ్‌ను వెనక్కి నెట్టిన BSE.. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద స్టాక్‌ మార్కెట్‌గా అవతరించింది. 

బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, ప్రస్తుతం, BSEలోని మొత్తం షేర్ల విలువ 5.18 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. హాంకాంగ్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 5.17 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం, యూఎస్‌ 56.49 ట్రిలియన్ల డాలర్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. చైనా 8.84 ట్రిలియన్‌ డాలర్లు, జపాన్ 6.30 ట్రిలియన్‌ డాలర్లతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 

ఇదిలా ఉండగా, గత వారం ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ మార్కెట్లు గణనీయమైన ఒడిదుడుకులను చవిచూశాయి. జూన్ 4న మార్కెట్ 6 శాతానికిపైగా క్షీణించింది. అయినప్పటికీ మార్కెట్‌ తిరిగి పుంజుకొని రికార్డు స్థాయిని తాకింది. BSEలోని అన్ని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌ రూ.32 లక్షల కోట్లకు పైగా పెరిగి కొత్త గరిష్ట స్థాయి రూ.432 లక్షల కోట్లకు అంటే 5.18 ట్రిలియన్ డాలర్లకు చేరింది. 

బారత్‌లో బొటాబొటి మెజారిటీతో ఎన్‌డీయే నేతృత్వంలోని మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. 25 ఏళ్ల క్రితం ఇదే పరిస్థితి తలెత్తింది. మోదీకి ఇది పరీక్షే అయినప్పటికీ కీలక మంత్రిత్వ శాఖల్లో కొనసాగింపు మార్కెట్ రాణింపునకు సానుకూలంగా మారింది. ఉత్పత్తి ఆధారిత పరిశ్రమలు, రోడ్లు, ఓడరేవులు, విమానయానం, రక్షణ, రైల్వేలు, గ్రీన్ ఎనర్జీ లాంటి రంగాల్లో పెట్టుబడుల వృద్ధిపై ఎన్‌డీయే ప్రభుత్వం దృష్టిసారిస్తుందని మార్కెట్‌ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక లోటు తగ్గడం, సాధారణ రుతు పవనాలు, ఆర్బీఐ 2.1 ట్రిలియన్‌ డాలర్ల డివిడెండ్‌ ఇవ్వడం కూడా భారత మార్కెట్‌కు సానుకూల అంశాలుగా పేర్కొన్నారు. అయినప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో ఇటీవలి సోషల్ ఇంజినీరింగ్, ఉచితాల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి రైతులు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలపై దృష్టిని పెంచాలని సూచిస్తున్నారు. అలాగే, భారత మార్కెట్‌ పుంజుకోవడానికి బడ్జెట్‌, జూన్‌ త్రైమాసిక ఆదాయాలు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే, ఈసారి సమ్మిళిత బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉండగా... మూలధన లాభాల పన్నులో మార్పులు ఉండబోవని తెలుస్తోంది. అయితే, బీజేపీ 240 పార్లమెంటు సీట్లు గెలుచుకోవడానికి ఈసారి చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల మద్దతు కూడగట్టాల్సి వచ్చింది. ఇది ఆర్థికంగా, రాజకీయంగా సవాలుగా ఉన్న సంస్కరణలకు ఆటంకం కలిగించడంతో పాటు మధ్యస్థ-కాల వృద్ధిని ప్రభావితం చేయవచ్చని IIFL సెక్యూరిటీస్ పేర్కొంది. ఇన్ని ఒడిదుడుకుల మధ్య భారత్‌ మరోసారి నాలుగో అతిపెద్ద మార్కెట్‌ అవతరించడం విశేషం. అయితే, గతంలోనూ హాంకాంగ్‌ మార్కెట్లను భారత్‌ అధిగమించింది. ఈ ఏడాది జనవరి 23న భారతీయ మార్కెట్లు హాంకాంగ్‌ను అధిగమించినప్పటికీ.. కొద్దిరోజులకే హాంకాంగ్ వెంటనే తిరిగి నాలుగో స్థానాన్ని పొందింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios