ఇండియాలో భారీ పెట్టబడులు పెట్టేందుకు జపాన్ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఇరుదేశాల ప్రధానుల భేటిలో కీలక చర్చలు జరిగాయి. అనంతరం మీడియాలో మాట్లాడిన ఇరు దేశాధినేతలు పెట్టుబడుల గురించి ప్రకటించారు.
భారత్, జపాన్ దేశాలు తమ వాణిజ్య, వ్యూహాత్మక బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా, రాబోయే పదేళ్లలో జపాన్ నుంచి భారత్‌కు 10 ట్రిలియన్ యెన్ల పెట్టుబడులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంతేకాదు సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం వంటి కీలక రంగాల్లో సహకారం కోసం రెండు దేశాలు కలిసి ఒక జాయింట్ రోడ్‌మ్యాప్‌ను కూడా ప్రకటించాయి.
గురువారం న్యూఢిల్లీలో 16వ ఇండియా-జపాన్ వార్షిక సదస్సు జరిగింది. ఈ సదస్సు తర్వాత జపాన్ ప్రధాని సనాయె తకైచితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మీడియా సమావేశంలో మాట్లాడారు. జపాన్ తొలి మహిళా ప్రధాని తకైచీకి స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు… ఆమెన తన లిటిల్ సిస్టర్ గా పేర్కొన్నారు. భారత్-జపాన్ బంధం రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాదని… ప్రపంచ శాంతికి మూలస్తంభంగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
భారత్-జపాన్ వాణిజ్య ఒప్పందాలు..
"ఇండియా-జపాన్ ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్‌నర్‌షిప్ రోజురోజుకీ బలపడుతోంది. గత ఏడాదిలోనే సుమారు 120 కొత్త బిజినెస్ ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 10 బిలియన్ డాలర్లకు పైగా జపాన్ పెట్టుబడులు భారత్‌కు రానున్నాయి," అని ప్రధాని మోదీ చెప్పారు. ఆర్థిక సంస్థల మధ్య జరిగిన ఒప్పందాలు పెట్టుబడుల ప్రవాహాన్ని మరింత సులభతరం చేస్తాయని ఆయన అన్నారు.
"మా లక్ష్యం స్పష్టంగా ఉంది. రాబోయే 10 ఏళ్లలో జపాన్ నుంచి భారత్‌కు 10 ట్రిలియన్ యెన్ల పెట్టుబడులు తీసుకురావాలి. అలాగే భారత్‌లోని జపనీస్ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయాలి. భారత్‌లో నిరంతరం జరుగుతున్న సంస్కరణల వల్ల వ్యాపారం చేయడం సులభతరమైంది. ఈ అవకాశాన్ని జపాన్ కంపెనీలు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు'' అని మోదీ పిలుపునిచ్చారు.
ఆర్థిక, ఇంధన భద్రత కోసం ఉమ్మడి రోడ్‌మ్యాప్
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో ఇంధన భద్రత, ఆర్థిక భద్రత కోసం భారత్, జపాన్ కలిసి ఒక ఉమ్మడి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశాయని ప్రధాని మోదీ తెలిపారు."ప్రత్యేక రోడ్‌మ్యాప్ ద్వారా సెమీకండక్టర్లు, క్వాంటం, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ వంటి వ్యూహాత్మక రంగాల్లో సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తాం" అని మోదీ స్పష్టం చేశారు. "ఇంధన భద్రత రంగంలో కూడా ఈరోజు మేము చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నాం" అని ఆయన అన్నారు.
"బ్యాటరీ, గ్రీన్ హైడ్రోజన్, అణుశక్తి రంగాల్లో మా సహకారం ప్రపంచ స్వచ్ఛ ఇంధన భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతుంది. ఆర్థిక భద్రతను ఉమ్మడి భద్రతగా, ఇంధన పరివర్తనను ఉమ్మడి అవకాశంగా భారత్, జపాన్ చూస్తున్నాయి. ఆ దిశగా కలిసి పనిచేస్తాం" అని ప్రధాని పేర్కొన్నారు.
ఉమ్మడి లక్ష్యాలపై జపాన్ ప్రధాని కామెంట్స్
ఈ ద్వైపాక్షిక సమావేశం తర్వాత జపాన్ ప్రధాని సనాయె తకైచి మాట్లాడుతూ.. తాము అనేక అంశాలపై చర్చించామన్నారు. ముఖ్యంగా ఆర్థిక భద్రత, ఇంధన భద్రత రంగాల్లో సహకారం తమ చర్చల్లో కేంద్రంగా ఉందని ఆమె తెలిపారు.
"ఆర్థిక ఆయుధీకరణ (economic weaponization), నాన్-మార్కెట్ పద్ధతులు వంటి సవాళ్లను రెండు దేశాలు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి కీలకమైన ఖనిజాల సరఫరా వ్యవస్థలలో మనం తక్షణమే పటిష్టతను నిర్మించుకోవాలి. మిడిల్ ఈస్ట్ పరిస్థితుల వల్ల ప్రభావితమైన ఇంధన భద్రత విషయంలో, ఈ ప్రాంతమంతటికీ ఇంధన భద్రత కల్పించే బాధ్యత జపాన్, భారత్‌లపై ఉంది'' అని తకైచి అన్నారు. ఆర్థిక భద్రత సహకారం కోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేసేలా ఒక జాయింట్ స్టేట్‌మెంట్‌ను విడుదల చేసినట్లు ఆమె తెలిపారు.
సహకారంతో ఆర్థిక వృద్ధి
పెట్టుబడులు, ఆవిష్కరణల ద్వారా భారత్, జపాన్ ఆర్థిక వృద్ధిని సాధించడమే తమ సహకార లక్ష్యమని జపాన్ ప్రధాని తకైచి అన్నారు. "17 వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా జపాన్ సరఫరా సామర్థ్యాన్ని, సాంకేతిక సామర్థ్యాలను పెంచడానికి నేను కట్టుబడి ఉన్నాను. ప్రధాని మోదీ 'వికసిత భారత్'ను ప్రారంభించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనేది జాతీయ లక్ష్యం. ఆయన భారత వృద్ధిని బలంగా ముందుకు నడిపిస్తున్నారు. ఈ విధంగా భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడం ద్వారా మన దేశాలను బలంగా, సంపన్నంగా మార్చాలనే ఉమ్మడి లక్ష్యాన్ని మేము పంచుకుంటున్నాం" అని తకైచి చెప్పారు.
"ఈ పర్యటన సందర్భంగా భారత, జపాన్ కంపెనీల మధ్య సుమారు 120 సహకార పత్రాలు ప్రకటించబడ్డాయి. ఇందులో 2 ట్రిలియన్ యెన్ల స్థాయి పెట్టుబడులు కూడా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసికట్టుగా భారత్, జపాన్‌లకు ఉజ్వల భవిష్యత్తును నిర్మించాలన్నది మా ఆకాంక్ష" అని తకైచి అన్నారు.
ఉన్నత స్థాయి ప్రతినిధుల చర్చలు
అంతకుముందు, ఇరు దేశాల నేతలు మొదట ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రతినిధి స్థాయి చర్చలకు నాయకత్వం వహించారు. భారత ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు తకైచి జూలై 1 నుంచి 3 వరకు భారత పర్యటనలో ఉన్నారు. ఇవాాళ ఉదయం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో తకైచికి ఘన స్వాగతం లభించింది.
గతంలో 2025 ఆగస్టులో టోక్యోలో జరిగిన 15వ వార్షిక సదస్సు కోసం ప్రధాని మోదీ జపాన్‌ను సందర్శించారు. ఈ వార్షిక సదస్సు ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించే కీలక మార్గంగా నిలుస్తోంది.


