సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్న ప్రస్తుత తరుణంలో అదే పార్టీకి చెందిన మరో మంత్రి ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న కే. పొన్ముడి.. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోరాడేందుకే ఇండియా కూటమి ఏర్పడిందని చెప్పారు.


రాబోయే లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కొనేందుకు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోరాడేందుకే ‘ఇండియా’ కూటమి ఏర్పడిందని డీఎంకే నేత, తమిళనాడు విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మ సూత్రాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇండియా కూటమి ఏర్పడిందని అన్నారు. తమ మధ్య విభేదాలు ఉండవచ్చునని, అయితే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోరాటంలో కూటమిలోని 26 పార్టీలు ఏకమయ్యాయని తెలిపారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాతో పోల్చి, దాన్ని నిర్మూలించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరిచుకుంది. ఉదయనిధి ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ.. కొన్ని అంశాలను మనం నిర్మూలించాల్సి ఉందని, వాటిని వ్యతిరేకించడం మాత్రమే సాధ్యం కాదన్నారు. ‘‘దోమలు, డెంగ్యూ జ్వరాలు, మలేరియా, కరోనా ఇలా అన్నింటిని మనం వ్యతిరేకించలేం, వాటిని నిర్మూలించాలి. సనాతన కూడా అలాంటిదే’’ అని చెప్పారు. 

Scroll to load tweet…

అతడి వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. కాగా.. తాజాగా మంత్రి పొన్ముడి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ‘‘సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేందుకే ఇండియా కూటమి ఏర్పడిందని డీఎంకే మంత్రి పొన్ముడి పునరుద్ఘాటించారు. హిందూమత నిర్మూలన ఇండియా కూటమిలోని పార్టీల సింగిల్ పాయింట్ ఎజెండాగా కనిపిస్తోంది. ఇదీ ఇండియా కూటమి నిజస్వరూపం. ఇటీవలి కాలంలో ఎన్నికైన మహిళా ప్రతినిధిపై కుల విద్వేషాన్ని వ్యాపింపజేసిన డీఎంకే మంత్రి పొన్ముడి సమాజంలో సమానత్వం, లింగ సమానత్వం గురించి వేదికపై మాట్లాడటం కూడా దురదృష్టకరం’’ అని బీజేపీ నాయకుడు అన్నామలై ఎక్స్ (ట్విట్టర్) లో పోస్టు పెట్టాడు. 

Scroll to load tweet…

పొన్ముడి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా స్పందించారు. ‘తమిళనాడు విద్యా శాఖ మంత్రి మాటలు వింటుంటే 'పిల్లి సంచిలోంచి బయటపడింది' అనే ఆంగ్ల సామెత గుర్తుకువస్తోంది. వారు ఏమనుకుంటున్నారో ఇప్పుడు స్పష్టమైంది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడానికి, అంతమొందించడానికి ‘ఇండియా కూటమి ఏర్పడింది’. సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడమే వారి రహస్య ఎజెండా.. వేరే మతానికి చెందిన దేవతలను విమర్శించే హక్కు ఉందా అని నేను కాంగ్రెస్ పార్టీని, ఈ కూటమిని అడుగుతున్నాను. ఇతర మతాల గురించి మౌనంగా ఉంటారు కాని బహిరంగంగా సనాతనాన్ని వ్యతిరేకిస్తారు.’’ అని అన్నారని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ నివేదించింది.