Aatmanirbhar Bharat: నిర్దేశించుకున్న సమయం కంటే ముందుగానే ఎగుమతుల విషయంలో భారత్ మరో మైలు రాయిని అందుకుంది. ఇది భారతదేశ 'ఆత్మనిర్భర్ భారత్' ప్రయాణంలో కీలక మైలురాయి అని ప్రధాని మోడీ అన్నారు.
Aatmanirbhar Bharat: భారత్ ఎగుమతుల విషయంలో మరో మైలు రాయిని అందుకుంది. నిర్దేశించుకున్న సమయం కంటే ముందుగానే ఎగుమతుల విషయంలో లక్ష్యాన్ని సాధించింది. భారతదేశం తన అత్యధిక వస్తువుల ఎగుమతి లక్ష్యం $400 బిలియన్లుగా పెట్టుకుంది. అయితే, షెడ్యూల్ కంటే తొమ్మిది రోజుల ముందుగానే దానిని సాధించింది. బుధవారం అత్యధిక వస్తువుల ఎగుమతి లక్ష్యం USD 400 బిలియన్లను సాధించింది. 400 బిలియన్ డాలర్ల వస్తువుల ఎగుమతి లక్ష్యాన్ని సాధించడంలో దేశం సాధించిన విజయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఇది భారతదేశ 'ఆత్మనిర్భర్ భారత్' (Aatmanirbhar Bharat) ప్రయాణంలో కీలక మైలురాయి అని అన్నారు.
వస్తువుల ఎగుమతుల్లో సరికొత్త మైలురాయిని భారత్ అందుకున్న విషయాన్ని ప్రస్తావించిన ప్రధాని మోడీ.. "భారతదేశం $400 బిలియన్ల వస్తువుల ఎగుమతుల ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మొట్టమొదటిసారిగా ఈ లక్ష్యాన్ని సాధించింది. ఈ విజయానికి కారణమైన మా రైతులు, నేత కార్మికులు, MSMEలు, తయారీదారులు, ఎగుమతిదారులను నేను అభినందిస్తున్నాను. మన ఆత్మనిర్భర్ భారత్ (Aatmanirbhar Bharat) ప్రయాణంలో ఇది కీలకమైన మైలురాయి. #LocalGoesGlobal." అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. భారతదేశ అత్యధిక ఎగుమతుల లక్ష్యాన్ని ఉద్దేశించిన గడువు కంటే తొమ్మిది రోజుల ముందుగానే సాధించిన విషయాన్ని వెల్లడించే గ్రాఫిక్స్ చిత్రాలను పోస్ట్ చేశారు.
సగటున, ప్రతి గంటకు USD 46 మిలియన్ వస్తువులు ఎగుమతి చేయబడతాయని అందులో పేర్కొన్నారు. అలాగే, ప్రతిరోజు USD 1 బిలియన్ వస్తువులు, ప్రతి నెల USD 33 బిలియన్ల విలువైన వస్తువులు ఎగుమతి చేయబడతాయని ఆ చిత్రాలు పేర్కొన్నాయి. కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 292 బిలియన్ డాలర్లు కాగా, 2021-22లో ఎగుమతులు 37 శాతం వృద్ధితో 400 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫిబ్రవరిలో, వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. "ఏప్రిల్ 2021 నుండి జనవరి 2022 వరకు వరుసగా 10 నెలల పాటు, భారతదేశం USD 30 బిలియన్ల ఎగుమతులను కొనసాగించింది. మేము ఇప్పటికే USD 334 బిలియన్ల ఎగుమతులను అధిగమించాము. పూర్తి 12 నెలల వ్యవధిలో భారతదేశం ఇంతకు ముందు చేసిన దానికంటే ఇది ఎక్కువ" అని పేర్కొన్నారు. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 14 వరకు భారతదేశ సరుకుల ఎగుమతులు USD 390 బిలియన్లకు చేరుకున్నాయని మరియు మార్చి 31, 2022తో ముగిసే సంవత్సరంలో ఖచ్చితంగా USD 400 బిలియన్లను దాటుతుందని అంతకు ముందు చెప్పారు.
