Independence Day 2023: ఆగస్టు 15న ఎర్రకోటలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశ వ్యాప్తంగా సుమారు 1800 మంది ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. పీఎం-కిసాన్ లబ్ధిదారులను కూడా ఇందులో చేర్చారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జెండాను ఎగురవేయనున్నారు.
Independence Day 2023: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధమవుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ప్రతి చోటీ ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. వేడుకలకు అధికారులకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీలోని ప్రఖ్యాత ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు. ప్రధాని మోదీ వరుసగా 10వ సారి ఎర్రకోట నుండి దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఎర్రకోట చుట్టూ తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 15న ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చాలా ప్రత్యేకం కానున్నాయి. ఈసారి పిఎం-కిసాన్ లబ్ధిదారులతో సహా దేశవ్యాప్తంగా 1,800 మంది సామాన్యులను ముఖ్య అతిథులు ఆహ్వానించబడ్డారు.
ఈ ప్రత్యేక అతిథుల జాబితాలో 660 గ్రామాలకు చెందిన 400 మంది సర్పంచ్‌లకు చోటు దక్కింది. అలాగే.. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పథకంతో అనుబంధించబడిన 250 మంది రైతులు, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం నుంచి 50 మంది, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన నుంచి 50 మంది పాల్గొనేవారు. అలాగే.. 50 మంది శ్రమ యోగులు (నిర్మాణ కార్మికులు), కొత్త పార్లమెంటు భవనంతో సహా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగమైన 50 మంది నిర్మాణ కార్మికులు, ఖాదీ కార్మికులు కూడా ముఖ్య అతిథులుగా ఆహ్వానించబడ్డారు.
దీంతో పాటు 50 మంది చొప్పున ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులకు కూడా ఈ ప్రత్యేక జాబితాలో చోటుదక్కింది. అదే సమయంలో ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం నుండి 75 జంటలు తమ సంప్రదాయ దుస్తులలో ఎర్రకోటలో జరిగే వేడుకను చూసేందుకు ఆహ్వానించబడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అన్ని అధికారిక ఆహ్వానాలు ఆహ్వాన పోర్టల్ (www.aamantran.mod.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో పంపబడ్డాయి. ఈ పోర్టల్ ద్వారా 17,000 ఇ-ఇన్విటేషన్ కార్డులు జారీ చేయబడ్డాయి.
సెల్ఫీ పాయింట్
నేషనల్ వార్ మెమోరియల్, ఇండియా గేట్, విజయ్ చౌక్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ప్రగతి మైదాన్, రాజ్ ఘాట్, జామా మసీద్ మెట్రో స్టేషన్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్, ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్, ITO మెట్రో గేట్, నౌబత్ ఖానా మరియు షీష్ గంజ్ సహా 12 ప్రదేశాలలో ప్రభుత్వం సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసింది. వేడుకల్లో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖ MyGov పోర్టల్‌లో ఆగస్టు 15-20 వరకు ఆన్‌లైన్ సెల్ఫీ పోటీని నిర్వహించనుంది. పోటీలో పాల్గొనేందుకు 12 స్థానాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రదేశాలలో సెల్ఫీలు తీసుకుని వాటిని MyGov ప్లాట్‌ఫారమ్‌లో అప్‌లోడ్ చేసేలా ప్రజలను ప్రోత్సహిస్తారు. ఆన్‌లైన్ సెల్ఫీ కాంటెస్ట్ ఆధారంగా ఒక్కో లొకేషన్ నుండి ఒకరి చొప్పున మొత్తం పన్నెండు మంది విజేతలు ఎంపిక చేయబడతారు. ఒక్కో విజేతకు రూ.10,000 ప్రైజ్ మనీ అందజేస్తారు.
ప్రధానికి రక్షణ మంత్రి స్వాగతం
ఎర్రకోటకు చేరుకున్న ప్రధానికి రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ మరియు రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ ఆరామ్నే స్వాగతం పలుకుతారు. డిఫెన్స్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ ఢిల్లీ సెక్టార్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC)ని ప్రధానికి పరిచయం చేస్తారు. ఆ తర్వాత ప్రధాని మోడీని సెల్యూటింగ్ వెన్యూకి తీసుకెళ్తారు. అక్కడ సంయుక్త ఇంటర్-సర్వీసెస్, ఢిల్లీ పోలీస్ గార్డు ప్రధానమంత్రికి సెల్యూట్ చేస్తారు. దీని తర్వాత ప్రధాని గార్డ్ ఆఫ్ ఆనర్‌ను అందుకోనున్నారు.
ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించిన వెంటనే, భారత వైమానిక దళానికి చెందిన రెండు అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు మార్క్-III ధ్రువ్ సైడ్ రో కాన్ఫిగరేషన్‌లో వేదికపై పూల వర్షం కురిపిస్తారు. హెలికాప్టర్ కెప్టెన్‌గా వింగ్ కమాండర్ అంబర్ అగర్వాల్, స్క్వాడ్రన్ లీడర్ హిమాన్షు శర్మ వ్యవహరిస్తారు. అంతేకాకుండా.. వేడుకలో భాగంగా యూనిఫాంలో ఉన్న ఎన్‌సిసి క్యాడెట్లను జ్ఞాన్ పథ్‌లో కూర్చోబెట్టనున్నారు. ఎర్రకోటలో పుష్పాలంకరణలో భాగంగా జి-20 చిహ్నం మరో ఆకర్షణగా నిలువనున్నది.
