Asianet News TeluguAsianet News Telugu

Independence Day 2022: భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి.. ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ..

భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. అంతకు ముందు ప్రధాని మోదీ.. రాజ్‌ ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు.

Independence Day 2022 pm modi hoisting national flag on red fort
Author
First Published Aug 15, 2022, 7:35 AM IST

భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. ప్రధాని హోదాలో మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించడం ఇది తొమ్మిదో సారి. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడానికి ముందు.. ప్రధాని మోదీ రాజ్‌ ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. అక్కడ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. అక్కడ మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతం అలపించారు. భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి.

అనంతరం చారిత్రక ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. త్రివర్ణ పతాకాన్ని గర ప్రపంచవ్యాప్తంగా భారత స్వాతంత్య్ర దినోత్సవం సంబరాలు జరుగుతున్నాయని.. అమృత మహోత్సవ వేళ భారతీయులందరికీ, భారతదేశాన్ని ప్రేమించేవారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టుగా చెప్పారు. అమృత మహోత్సవాల వేళ కొత్త దశ, దిశ ఏర్పాటు చేసుకోవాలన్నారు. త్యాగధనుల పోరాట ఫలితమే మన స్వాతంత్య్రం అని గుర్తుచేశారు. ఎందరో మహనీయులు పోరాడి మనకు స్వాతంత్య్రం అందించారని చెప్పారు. 

‘‘కర్తవ్య మార్గంలో తమ ప్రాణాలను అర్పించిన బాపు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, వీర్ సావర్కర్‌లకు దేశ పౌరులు కృతజ్ఞతలు తెలిపుతున్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పునాది వేసిన.. మంగళ్ పాండే, తాత్యా తోపే, భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ వంటి మన అసంఖ్యాక విప్లవకారులకు ఈ దేశం కృతజ్ఞతలు తెలుపుతుంది. మహానీయుల తిరుగుబాట్లు మనకు స్పూర్తిదాయకం. అల్లూరి, గోవింద్ గురు వంటి వారి తిరుగుబాట్లు మనకు ఆదర్శం. వారి బలిదానాలను స్మరించుకునే అదృష్టం కలిగింది. 

ఆజాదీ మహోత్సవ్‌ సందర్భంగా మనం ఎందరో జాతీయ నాయకులను స్మరించుకున్నాం. ఆగస్ట్ 14న మనం దేశ విభజన గుర్తుచేసుకున్నాము. గత 75 ఏళ్లలో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించిన దేశ పౌరులందరినీ ఈరోజు స్మరించుకోవాల్సిన రోజు. రాణి లక్ష్మీబాయి, ఝల్కారీ బాయి, చెన్నమ్మ, బెగన్ హజ్రత్ మహల్ వంటి భారత మహిళల బలాన్ని గుర్తు చేసుకుంటే భారతదేశం గర్వంతో నిండిపోతుంది. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారైనా లేదా దేశాన్ని నిర్మించిన వారైనా -డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ జీ, సర్దార్ పటేల్, ఎస్పీ ముఖర్జీ, ఎల్‌బీ శాస్త్రి, దీనదయాళ్ ఉపాధ్యాయ, జేపీ నారాయణ్, ఆర్‌ఎం లోహియా, వినోబా భావే, నానాజీ దేశ్‌ముఖ్, సుబ్రమణ్య భారతి-ఇదే రోజు అటువంటి గొప్ప వ్యక్తుల ముందు తలవంచండి. 

భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి. 75 ఏళ్ల ప్రయాణంలో భారత్‌కు అమూల్యమైన సామర్థ్యం ఉందని నిరూపించుకుంది. అనేక సవాళ్లను ఎదుర్కొంది. స్వాతంత్య్ర పోరాటం గురించి మాట్లాడేటప్పుడు గిరిజన సమాజాన్ని మర్చిపోలేం. భగవాన్ బిర్సా ముండా, సిద్ధూ-కణ్హు, అల్లూరి సీతారామ రాజు, గోవింద్ గురు.. వంటివారు స్వాతంత్ర్య పోరాటానికి గొంతుకగా నిలిచారు. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన అభివృద్ధి పథాన్ని చాలా మంది శంకించారు. భారత్ ముక్కలు చెక్కలు అవుతుందని అన్నారు. కానీ, ఈ దేశంలోని ప్రజల గురించి వారికి పూర్తిగా తెలియదు. ఈ నేల ప్రత్యేకమైనదని వారికి తెలియదు. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ నిలిచి గెలిచింది. 

భారతదేశం ఒక ఆకాంక్షాత్మక సమాజం.. ఇక్కడ మార్పులు సామూహిక స్ఫూర్తితో శక్తిని పొందుతున్నాయి. భారతదేశ ప్రజలు సానుకూల మార్పులను కోరుకుంటున్నారు. దానికి సహకరించాలని కూడా కోరుకుంటున్నారు. ఆకలి కేకలు, యుద్దాలు, తీవ్రవాదం, అతివాదం.. వంటి సమస్యలపై భారత్ ఎదురొడ్డి నిలిచింది. వైజ్ఞానిక రంగంలో భారత్ తనదైన ముద్ర వేస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు. 

ఇక, ఈరోజు ఉదయం సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘దేశప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్!’’ అని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios