Kashmir tourism: జ‌మ్మూకాశ్మీర్ లో గ‌తంలో పోలిస్తే ఇప్పుడు ప‌రిస్థితులు భిన్నంగా మారిపోయాయి. ఉద్రిక్త‌త‌లు, కాల్పుల‌తో కొన‌సాగిన కాశ్మీర్.. ఇప్పుడు ప్ర‌శాంతంగా మారి.. ప‌ర్యాట‌కుల‌ను పెద్ద సంఖ్య‌లో ఆక‌ర్షిస్తోంది. గ‌త రెండేళ్లుగా క్ర‌మంగా ప‌ర్యాట‌కుల తాకిడి పెరిగింది. ఈ క్ర‌మంలోనే కాశ్మీర్ లోని మార‌మూల ప్రాంతాల్లో కూడా కొత్త‌గా హోట‌ళ్లు, ప‌ర్యాట‌క వ‌స‌తి గృహాల ఏర్పాటు చేయ‌డంతో పాటు, ఇప్ప‌టికే ఉన్న హోట‌ళ్ల పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్నాయి.  

Kashmir tourism-Hotels: జ‌మ్మూకాశ్మీర్ ప్రాంతానికి సంద‌ర్శ‌కుల తాకిడి పెర‌గ‌డం ఇక్క‌డి ప‌ర్యాట‌క‌ సానుకూల ధోరణిని సూచిస్తుంది. జ‌మ్మూకాశ్మీర్ లోని దాదాపు అన్ని హోటళ్లలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయ‌నీ, ఇతరులు కూడా ఈ చ‌ర్య‌ల‌ను, ఆలోచ‌న‌న‌ల‌ను తీవ్రంగా పరిశీలిస్తున్నార‌ని జమ్మూ కాశ్మీర్ హోటల్ క్లబ్ అధ్యక్షుడు ముస్తాక్ ఛాయా చెప్పారు. రెండేళ్ల క్రితం వరకు మరణశయ్యపై ఉన్న కేంద్రపాలిత ప్రాంతంలోని హోటల్ పరిశ్రమ పర్యాటకుల రద్దీతో తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. పర్యాటకులకు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు హోటళ్లు తమ మౌలిక సదుపాయాలను పునర్నిర్మించే పనిలో నిమగ్నమయ్యాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా దాదాపు మూడు దశాబ్దాలుగా పర్యాటకులు జమ్మూకాశ్మీర్ సందర్శనను దాదాపు నిలిపివేశారు. ఆగస్టు 5, 2019న, జమ్మూ కాశ్మీర్ నుండి ప్రత్యేక ప్రతిపత్తిని ఉపసంహరించుకోవడం, కోవిడ్ -19 మహమ్మారి ముగిసిన తరువాత, పర్యాటకులు కాశ్మీర్ కు రావడం ప్రారంభించారు. దీంతో హోటల్ యజమానులు ప‌ర్యాట‌న‌ల‌కు అనుగుణంగా ముందుకు వచ్చి పర్యాటకులను ప్రోత్సహించడంలో ఏమాత్రం వెనుకంజ వేయలేదు. అన్ని అధునిక సౌకర్యాలు క‌ల్పించే దిశ‌గా పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు చేప‌ట్టారు.

గత రెండేళ్లలో వాతావరణంలో వచ్చిన మార్పులతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా, హోటల్ పరిశ్రమల ఆదాయం కూడా పెరిగిందని ముస్తాక్ ఛాయా చెప్పారు. కాశ్మీర్ హోటల్స్ క్లబ్ లెక్కల ప్రకారం గత ఏడాది 1.87 కోట్ల మంది పర్యాటకులు జమ్మూకాశ్మీర్ కు వచ్చారు. వీరిలో 22 లక్షల మంది కాశ్మీర్ ను సందర్శించారు. జమ్మూ ప్రాంతంలో మాతా వైష్ణోదేవి తీర్థయాత్రను చేపట్టే భక్తుల‌తో జమ్మూ కాశ్మీర్ కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాశ్మీర్ ప‌ర్యాట‌క రంగం గత ఏడాది కంటే ఈ ఏడాది కూడా మెరుగ్గా ఉందని చెప్పారు. ప్రస్తుత సంవత్సరంలో 25 లక్షల మందికి పైగా పర్యాటకులు కాశ్మీర్ ను సందర్శిస్తారని అంచనా. వర్షాకాలంలో కూడా కాశ్మీర్ లోని హోటళ్లు ఫుల్ ఆక్యుపెన్సీని ప్రకటిస్తున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా దాల్ సరస్సులో చేపలు అమ్ముతున్న అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ.. "నా వ్యాపారం బాగా జరుగుతోంది. గత సంవత్సరం గొప్పగా ఉంది. ఈ ఏడాది మరింత మెరుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం" చేశారు. హోటల్ పరిశ్రమతో సంబంధం ఉన్న మౌసం బక్షి మాట్లాడుతూ.. పెరిగిన ప‌ర్యాట‌కుల‌ రద్దీ కారణంగా, హోటళ్లలో వసతి కొరత ఏర్పడుతోంది. పర్యాటకుల తాకిడి కొనసాగుతుండటంతో చాలా హోటళ్లు గదులను పెంచుకుంటున్నాయ‌ని చెప్పారు. జమ్మూ-కాశ్మీర్ హోటల్స్ క్లబ్ లో 200ల‌కు పైగా హోటళ్లు ఉన్నాయి. శాంతి నెలకొనడంతో విస్తరణ అంశంపై తమ సంస్థ పలు సమావేశాలు నిర్వహించిందనీ, కాశ్మీర్ ను సందర్శించేలా ప్రజలను ప్రోత్సహిస్తోందని ఆ సంస్థ అధ్యక్షుడు ముస్తాక్ ఛాయా చెప్పారు.

కాశ్మీర్ లోని మారుమూల ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణానికి సంబంధించిన నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని చెప్పారు. హోటళ్లలో పెట్టుబడులు పెట్టేందుకు బయటి వ్యక్తులు ఇంకా ఆసక్తి చూపకపోవడంతో స్థానిక హోటళ్లు ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ చైన్లను విస్తరించాలనుకుంటున్నాయి. గుల్మార్గ్, సోనామార్గ్ వంటి ప్రాంతాల్లో నిబంధనలను కాస్త సడలిస్తే తమ పనిని కొనసాగించేందుకు దోహదపడుతుందని ముస్తాక్ ఛాయా తెలిపారు. పర్యావరణాన్ని, ముఖ్యంగా బలహీనమైన దాల్ సరస్సు, ఇతర నీటి వనరులను రక్షించడానికి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కఠినమైన నిబంధనలను రూపొందించింది. పహల్గాం, గుల్మార్గ్ వంటి రిసార్టుల్లో ల్యాండ్ మాఫియా హోటళ్ల నిర్మాణం కోసం అటవీ భూమిని ఆక్రమించడం ప్రారంభించిందనే ఆందోళ‌న ఉంది. పర్యాటకుల రాక ప‌ర్యాట‌క రంగానికి మాత్రమే కాకుండా కూరగాయలు, మాంసం, తృణధాన్యాలు, పండ్లు, హస్తకళలు, వ్యవసాయం, రవాణా మొదలైన చిన్న వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుస్తోంది. ప‌ర్యాట‌కం నుంచి ఆయా వ‌ర్గాలు కూడా పెద్ద ప్రయోజనం పొందుతున్నాయి.

- ఆవాజ్ ది వాయిస్ సౌజన్యంతో..