అప్పుడప్పుడు ప్రభుత్వాధికారులు చేసే పనికి నవ్వాలో.. ఎడవాలో తెలియని పరిస్ధితి వస్తుంది. ఒడిషాలో అచ్చం అలాంటి ఘటనే జరిగింది. రెక్కాడితే గానీ డొక్కాడని ఓ దినసరి కూలీకి ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపడంతో అతను ఖంగుతిన్నాడు. 

Also Read:దిగ్భ్రాంతి కరమే, వేడుక చేసుకున్నారు: నిర్భయ వాదనల్లో దిశ ఘటన ప్రస్తావన

వివరాల్లోకి వెళితే.. నాబారంగ్‌పూర్‌లోని పుర్జరిభరంది గ్రామానికి చెందిన సనధర్ గంద్ ఓ దినసరి కూలీ... కూలి పనులకు వెళ్లి అతను కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో 2014-15 వార్షిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకులో రూ.1.74 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిపినందుకు గాను ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. 

దీనిపై స్పందించిన సనధర గంద్.. తనను రూ.2.59 లక్షలు పన్ను చెల్లించాలని అధికారులు నోటీసులు పంపారని తనకు అంతా అయోమయంగా ఉందన్నాడు.

కాగా.. తాను అదే గ్రామానికి చెందిన పప్పు అగర్వాల్ అనే వ్యాపారి ఇంట్లో ఏడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. కొద్దిరోజుల క్రితం తన యజమానికి భూమి పట్టా, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు నకళ్లు అడిగితే ఇచ్చానని గంధ్ చెప్పాడు. వాటితో ఆయన ఏం చేశాడో తెలియదని, ఖాళీ పేపర్, భూమి పట్టాలపై తన సంతకం తీసుకుని మోసం చేశాడంటూ అతను ఆవేదన వ్యక్తం చేశాడు. 

Also Read:అక్రమ సంబంధం, ప్రియురాలి భర్తను చంపేసి... ‘దృశ్యం’ సినిమా రేంజ్ లో...

అయితే సనధర గంద్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అతని యజమాని బ్యాంకు ఖాతాను తెరిచి దానిని నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై అధికారులు స్పందిస్తూ.. సదరు ఖాతాను ఎవరు నిర్వహించారన్నది తమకు అనవసరమని బదులిచ్చారు. దీంతో అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో పాలు పోక సనధర్ గంద్ తీవ్ర ఆందోళన చెందుతున్నాడు.