ప్రధాని నరేంద్ర మోడీపై డాక్యుమెంటరీ తర్వాత భారత్‌లోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించిన ఘటన కలకలం రేపుతోంది. దాదాపు 3 రోజుల పాటు జరిపిన సోదాలకు సంబంధించి ఐటీ శాఖ కీలక ప్రకటన చేసింది.  

బీబీసీలో ఐటీ అధికారుల సర్వేపై అధికారిక ప్రకటన వెలువడింది. బీబీసీలో లావాదేవీలపై సర్వే జరిపినట్లు ఐటీ శాఖ ప్రకటించింది. లావాదేవీల డాక్యుమెంట్స్ పరిశీలించినట్లు తెలిపింది. 4 రోజులుగా ముంబై, ఢిల్లీ బీబీసీ ఆఫీసుల్లో ఐటీ శాఖ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. 

ఢిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన దాడులు (ఫిబ్రవరి 16)గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ముగిశాయి. బీబీసీ కార్యాలయాల నుంచి ఐటీ అధికారులు వెళ్లిపోయారని బీబీసీ అధికార ప్రతినిధి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.

ALso REad: బీబీసీ కార్యాలయాల్లో ముగిసిన ఐటీ దాడులు.. బీబీసీ అధికార ప్రతినిధి కీలక ప్రకటన..

బీబీసీ అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. ”ఢిల్లీ, ముంబయిలోని మా కార్యాలయాల నుంచి ఆదాయ పన్ను శాఖ అధికారులు వెళ్లిపోయారు. అధికారులకు మేం సహకరిస్తూనే ఉంటాం. ఈ అంశం త్వరలోనే పరిష్కారమవు తుందని ఆశిస్తున్నాం. మా సిబ్బందికి అండగా ఉంటున్నాం. మా సిబ్బంది సంక్షేమం మాకు అత్యంత ముఖ్యం. మా కార్యకలాపాలు మళ్లీ యథావిధిగా సాగుతున్నాయి. భారతదేశంలోని, బయట ఉన్న మా ప్రేక్షకులు, పాఠకులకు వార్తలు అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. బీబీసీ విశ్వసనీయమైన స్వతంత్ర మీడియా సంస్థ. ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా వార్తలు రిపోర్ట్ చేసే మా జర్నలిస్టులు, సహోద్యోగులకు మేం ఎప్పుడూ అండగా నిలబడతాం” అని పేర్కొన్నారు. ఫిబ్రవరి 14 న ఐటీ అధికారులు ఢిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు ప్రారంభించారు.ఈ క్రమంలో బీబీసీ సిబ్బంది సహకరించినట్టు సమాచారం.

బీబీసీ కార్యాలయాల్లో ఐటీ దాడులను అధికార బీజేపీ సమర్థించింది. ఏ సంస్థ కూడా చట్టానికి అతీతం కాదని పేర్కొంది. చట్టానికి లోబడే సోదాలు జరుగుతున్నాయని, వాటిని ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మంగళవారం అన్నారు. బీబీసీని ప్రపంచంలో అత్యంత భ్రష్టమైన సంస్థ అని ఆయన వర్ణించారు. అదే సమయంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ కూడా స్పందించారు. ఆయన కూడా ఐటీ దాడులను సమర్థించారు. ఎవరూ కూడా చట్టానికి అతీతులు కాదనీ, బీబీసీ ఢిల్లీ, ముంబయి ఆఫీసుల్లోని సోదాల గురించి పూర్తి వివరాలను ఐటీ శాఖ ఇస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ అన్నారు.

ప్రతిపక్షాల విమర్శలు

మరోవైపు .. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ దాడులను పాత్రికేయ సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, పలు రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో ఖండించాయి. ఈ సోదాలు.. పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకమని విమర్శించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. 'అదానీ కేసులో జేపీసీ ఏర్పాటు చేయాలని మేం అడుగుతుంటే ప్రభుత్వం బీబీసీ వెంట పడుతోంది. వినాశకాలే విపరీత బుద్ధి' అంటూ చురుకలాంటించారు.

బీబీసీ కార్యాలయాల్లో ఐటీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో స్పందించారు. కేంద్రప్రభుత్వంపై మండిపడుతూ.. ఇది పాత్రికేయ స్వేచ్ఛను 'హరించడమే'అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కూడా విమర్శించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి మానవ హక్కుల సంస్థలు కూడా బీబీసీ కార్యాలయాల్లో ఐటీ దాడులను ఖండించాయి.