మహిళ డబ్బులు చెల్లించడం ఆపేయడంతో, నిందితుడు ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడం ప్రారంభించాడని పోలీసు అధికారి తెలిపారు.

ముంబై : ముంబైకి చెందిన 51 ఏళ్ల మహిళ వాలెంటైన్స్ డే గిఫ్ట్ పేరుతో రూ. 3.68 లక్షలు పోగొట్టుకున్న ఘటన వెలుగు చూసింది. ఆమెకు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతను తనకు ప్రేమికుల రోజు కానుక పంపిస్తానని ఎరవేశాడని ఓ పోలీసు అధికారి సోమవారం తెలిపారు.

ఆ మహిళ వివాహిత, ఆమెకు గత బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతను తనను తాను అలెక్స్ లోరెంజోగా పరిచయం చేసుకున్నాడని ఖార్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.ఆ వ్యక్తి తనకు వాలెంటైన్స్ డే బహుమతిని పంపానని చెప్పాడు. అయితే, ఆ పార్శిల్ అందుకోవడానికి ఆమె 750 యూరోలు చెల్లించాల్సి ఉంటుందని ఫిర్యాదుదారుని ఉటంకిస్తూ చెప్పాడు.

తరువాత, ఆమెకు కొరియర్ కంపెనీ నుండి ఒక మెసేజ్ వచ్చింది, పార్శిల్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువుందని అందుకోసం ఆమె రూ. 72,000 అదనపు ఛార్జీని చెల్లించవలసి ఉంటుందని చెప్పారు. దీంతో ఆమె ఆ మొత్తం చెల్లించిందని అధికారి తెలిపారు. అయితే, ఇది ఇక్కడితో ఆగిపోలేదు. ఆమె ఈ డబ్బులు కట్టిన తరువాత కొరియర్ కంపెనీ ప్రతినిధులు మళ్లోసారి ఆ మహిళను సంప్రదించారు. పార్శిల్‌లో యూరోపియన్ కరెన్సీ నోట్లు ఉన్నాయని, మనీలాండరింగ్ కోసం ఛార్జీ విధించకుండా ఉండటానికి, ఆమె రూ. 2,65,000 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఆమె దీనికి ఒప్పుకుని ఆ మొత్తాన్ని చెల్లించింది. 

ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్ బ్రతికే ఉన్నారు.. ప్రజల ముందుకు వస్తారు: నెడుమారన్ సంచలన వెల్లడి

అయితే, అప్పటికీ ఆ పార్సిల్ ఆమెకు చేరలేదు. పార్శిల్‌ కావాలంటే మరోసారి రూ. 98,000 చెల్లించాలని మహిళను మళ్లీ అడిగారు. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. డబ్బులు కట్టడం మానేసింది. దీంతో లోరెంజో ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, ఆమె కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేస్తానని ఆమెను బెదిరించడం ప్రారంభించాడని అధికారి తెలిపారు.

దీంతో ఆ మహిళ ఖార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ఆదివారం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై వివిధ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 420 (మోసం), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. కేసుపై దర్యాప్తు ప్రారంభించామని ఆయన తెలిపారు.