అఫ్సానా ఖతూన్ రూ. 3 వేలతో 2003లో వ్యాపారం ప్రారంభించింది. తలపై బట్టలుమోసుకుంటూ ఊళ్లు తిరుగుతూ అమ్మింది. ఇప్పుడు వందలాది మహిళలకు ఉపాధిని కల్పించింది. ఆమె విజయగాధ ఇదే. 

న్యూఢిల్లీ: మొహమ్మద్ ఆయుబ్, అఫ్సానా ఖతూన్‌లు భార్య భర్తలు. వారిద్దరూ నోయిడాలో నిర్వహించిన సరస్ అజీవికా మేలాలో స్టాల్ ఏర్పాటు చేశారు. ఢిల్లీ సమీపంలో నిర్వహించిన ఈ మేలాలో వారు వస్త్రాలను అమ్మారు. అఫ్సానాతో ఆవాజ్ ది వాయిస్ మీడియా మాట్లాడింది. పెళ్లి తర్వాత తాను వ్యాపారం ప్రారంభించాలని భావించింది. కానీ, అత్తింటివారు అంగీకరించలేదు.

ఆ సమయంలో తన భర్త కూడా తనకు దూరమయ్యాడని గుర్తు చేసుకుంది అఫ్సానా. ‘నా భర్త కూడా నన్ను వదిలిపెట్టాడు. ఆరు నెలల తర్వాత అత్తింటివారి ఇంటి నుంచి గెంటేశారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ముందు ఆర్థిక సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకున్నాను. కానీ, నా ప్రతిపాదనను అత్తింటివారు ఒప్పుకోలేదు. ఆడ మనిషి వ్యాపారం చేయడం, సంపాదించడమేమిటీ? అంటూ మాట్లాడారు. కానీ, నేను పట్టువిడువలేదు. వారికి నచ్చచెప్పే ప్రయత్నాల్లోనే ఉన్నాను. కొన్ని నెలల తర్వాత వారు నా ప్రతిపాదనను అంగీకరించారు. ఆ తర్వాత నా భర్త కూడా నన్ను సపోర్ట్ చేశాడు’ అని అఫ్సానా తెలిపింది. తన భర్త మద్దతు లభించడం ప్రోత్సాహకరంగా అనిపించిందని వివరించింది.

2003లో తాను కేవలం రూ. 3 వేలతో వ్యాపారం మొదలు పెట్టినట్టు అఫ్సానా తెలిపింది. తలపై బట్టలు మోసుకుని ఊర్లు తిరిగేదాన్ని అని వివరించింది. అప్పటి రోజులను వర్ణించడం తన తరం కాదని పేర్కొంది. ‘2003లో నేను దుస్తులు కుట్టి అమ్మాలనే నిర్ణయానికి వచ్చాను. అదంతా ఒక్కదానితో అయ్యే పని కాదనీ అర్థమైంది. అందుకే కొందరు మహిళలతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్రారంభించాను. ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆర్టిసాన్స్ నుంచి డ్రెస్సులు కలెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఇప్పుడు నేను అల్లా ఆశీర్వాదంతో వార్షికంగా లక్షలు సంపాదిస్తున్నా’ అని ఆమె వివరించింది.

మీ గ్రూపుల్లో ఎంత మంది పని చేస్తున్నారని అడగ్గా.. సుమారు 400 మంది ప్రస్తుతం పని చేస్తున్నారని ఆమె తెలిపింది. ఎన్నో గ్రూపులు ఏర్పాటు అయ్యాయని, గ్రూపుల్లోనూ మళ్లీ గ్రూపులుగా తయారయ్యాయని వివరించింది. 

Also Read: రాజకీయ కోణంలోనే విచారణ, నా ఫోన్లు ఇస్తున్నా: ఈడీకి కవిత లేఖ

అఫ్సానా భర్త మొహమ్మద్ ఆయుబ్ మాట్లాడుతూ.. తాము హ్యాండ్‌మేడ్ క్లాథ్స్ అమ్ముతామని వివరించారు. రాంపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు అందరూ ఇళ్లలో ఇదే పని చేస్తున్నారని తెలిపారు. తన భార్య మొదట్లో ఇంటి బయట పని చేస్తానంటే వారించామని, కానీ, ఇప్పుడు రోజువారీగా వేల రూపాయలు సంపాదిస్తున్నామని చెప్పారు.

ఈ పని ఇళ్లలోనే జరుగుతుందని, స్కూల్ వెళ్లి వచ్చాక విద్యార్థులు కూడా ఈ పనిలో పాల్గొంటున్నారని, వారంతా గ్రూప్‌లలో చేరి పనులు చేస్తున్నారని తెలిపారు. 

అఫ్సానా మాట్లాడుతూ, తనకు ప్రభుత్వం కూడా సహకరించిందని వివరించారు. మహిళలు వారికి వారుగా సాధికారిత సాధించు కోవాలని తెలిపారు. ఎన్నో అవాంతరాలు వస్తుంటాయని, కానీ, ప్రయాణాన్ని ఆపవద్దని తోటి మహిళలకు అమూల్యమైన సలహా ఆమె ఇచ్చారు.