న్యూఢిల్లీలోని బురారీ ప్రాంతంలో 11 సామూహిక ఆత్మహత్యలు చేసుకొన్న ఘటనలో పోలీసులు 200 మందిని విచారణ చేశారు. ఈ కేసుకు సంబంధించి పోస్ట్ మార్టమ్ నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని బురారీలో లలిత్ భాటియా కుటుంబంలో 11 మంది సామూహికంగా ఆత్మహత్య చేసుకొన్న ఘటనపై ఇప్పటికే 200 మందిని పోలీసులు ప్రశ్నించారు.
11 మంది సామూహిక ఆత్మహత్యలు చేసుకొన్న ఘటనపై పూర్తిస్తాయి పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చిన తర్వాత ఈ కేసు విచారణకు సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
ప్రియాంకకు కాబోయే భర్తను ఈ విషయమై పోలీసులు మరోసారి ప్రశ్నించారు. అయితే ఈ కుటుంబానికి ఈ రకమైన సంప్రదాయాలు ఉన్న విషయం తనకు తెలియదని ఆయన పోలీసులకు చెప్పినట్టు సమాచారం.సుమారు మూడు గంటలకు పైగా ఆయనను విచారణ చేసినట్టు తెలుస్తోంది.
బురారీ ప్రాంతంలో 11 మంది సామూహిక ఆత్మహత్యలు చేసుకొన్న ఘటనపై పలువురిని పోలీసులు పలు రకాలుగా విచారణ చేస్తున్నారు. లలిత్ భాటియా తండ్రి మరణించిన తర్వాత కొంత కాలానికి తండ్రి తనకు ఆదేశాలు జారీ చేస్తున్నారని కుటుంబసభ్యులకు చెప్పేవాడు. ఈ విషయాన్ని ఆయన పుస్తకంలో రాసి కుటుంబసభ్యులకు వివరించేవాడు.
చాలా ఏళ్ల నుండి లలిత్ భాటియా తన తండ్రి ఆదేశాలను వింటున్నట్టుగా కుటుంబసభ్యులను కూడ నమ్మించాడు. అయితే మోక్షం కోసం సామూహికంగా ఆత్మహత్య చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. అయితే ఈ కేసులో అసలు వాస్తవాలను వెలికితీసేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
