మణిపూర్ హింసపై ప్రధాని మోడీ మాట్లాడాల్సిందేనని పట్టుబట్టిన ఇండియా కూటమి పార్టీలు తాజాగా తమ డిమాండ్‌ను గుజరాత్ అల్లర్ల సమయంలో వాజ్‌పేయి చర్చించిన విషయాన్ని ప్రస్తావించి సమర్థించుకున్నాయి. గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు రాజ్యసభలో వాటిపై చర్చ జరిగిందని, అప్పటి ప్రధాని వాజ్‌పేయి, అప్పటి హోం మంత్రి ఎల్ కే అడ్వాణీ మాట్లాడారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ గుర్తు చేశారు.
న్యూఢిల్లీ: మణిపూర్ హింసపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో మాట్లాడాలని విపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అందుకోసం ఏకంగా అవిశ్వాస తీర్మానాన్నే ప్రవేశపెట్టింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆ అవిశ్వాస తీర్మానాన్ని అంగీకరించారు. త్వరలోనే తేదీ ప్రకటించి ఆ రోజున అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతిస్తామని తెలిపారు. అయితే, ప్రధానమంత్రి మాట్లాడాల్సిన అవసరం ఏముందని అధికారపక్షం నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. శాంతి భద్రతకు బాధ్యత వహించే హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు కదా? అని అడుగుతున్నాయి. ఈ సందర్భంలో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తమ డిమాండ్ సమర్థించుకుంటూ మాజీ ప్రధాని వాజ్‌పేయిని ప్రస్తావించారు.
రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్ హింసపై మాట్లాడాలని ఇండియా కూటమి పార్టీలు చేస్తున్న డిమాండ్‌ను ప్రశ్నించేవారు ఒక్కసారి 2002 మేలో జరిగిన పార్లమెంటు సమావేశాలను గుర్తు చేసుకోవాలని జైరాం రమేశ్ అన్నారు. 2002 మే 6వ తేదీన రాజ్యసభ గుజరాత్ అల్లర్లపై చర్చించిందని వివరించారు. అప్పుడు కాంగ్రెస్ ఎంపీ అర్జున్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆరు వారాల పాటు జరిగిన గుజరాత్ అల్లర్లపై ఈ సభ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నదని, ఆ అల్లర్లు పెద్ద సంఖ్యలో మనుషుల మరణాలకు, కోట్ల రూపాయాల ఆస్తులు ధ్వంసం కావడానికి కారణమయ్యాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్టికల్ 355ని ప్రయోగించి పౌరులకు ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని, బాధితులకు ఉపశమనం, పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
Also Read: మణిపూర్‌లో రాజ్యాంగ యంత్రాంగం విచ్చిన్నమైనట్టుగా కనిపిస్తోందన్న సుప్రీం.. రాష్ట్ర డీజీపీకి సమన్లు..
అంతేకాదు, అప్పుడు పార్లమెంటులో జరిగిన పరిణామాలను క్రొనొలాజికల్‌గా జైరాం రమేశ్ ప్రస్తావించారు. మధ్యాహ్నం 12.04 గంటలకు ప్రతిపక్ష నేత మన్మోహన్ సింగ్ ఆ తీర్మానంపై మాట్లాడారని, 12.26 గంటలకు ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మాట్లాడారని, 12.56 గంటలకు అప్పటి హోం వ్యవహారాల శాఖ మంత్రి ఎల్ కే అడ్వాణీ మాట్లాడినట్టు జైరాం రమేశ్ గుర్తు చేశారు.
