ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మండిలో పరిచయం పేరుతో జూనియర్‌లపై ర్యాగింగ్‌కు పాల్పడిన ఉదంతం ఇంకా కొలిక్కి రాలేదు. దేవభూమి హిమాచల్‌లో విపత్తుకు మాంసాహారమే కారణం చెప్పి  ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ లక్ష్మీధర్ బెహరా కొత్త వివాదానికి తెర లేపారు. అతడికి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ అగ్ర రాజ్యాలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్నా మన దేశంలో ఇంకా అక్కడక్కడ మూఢనమ్మకాలు రాజ్యమేలు తున్నాయి. అయితే.. చదువురాని నిరక్ష్యరాస్యులు వీటిని నమ్ముతున్నారు. వాటిని ప్రచారం చేస్తున్నారంటే.. ఓ అర్థముంది. కానీ ఉన్నత చదువులు చదివి, ఐఐటీ వంటి శాస్త్ర సాంకేతిక విద్యను నేర్పించే సంస్థలో పనిచేసే ఓ ప్రొఫెసరే.. మూఢనమ్మకాలు, అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తే ఏమనాలి. మనం ఏం అర్ధం చేసుకోవాలి

హిమాచల్ ప్రదేశ్ లో తరుచు కురిసే భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు జరుగున్నాయి. దీంతో అక్కడి జనజీవవం అతలాకుతలమవుతోంది. భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతున్న విషయం తెలిసిందే.. అయితే.. ఆ అకాల వర్షాలు, వరదలు, ఆస్తి, ప్రాణా నష్టానికి కారణం జంతువులను క్రూరంగా హింసించడం, ప్రజలు మాంసం తినడమే అంటూ ఐఐటి మండి డైరెక్టర్ లక్ష్మీధర్ బెహెరా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు నేడు వివాదాస్పదంగా మారాయి. 

హిమాచల్ ప్రదేశ్‌లోని ఐఐటి మండి డైరెక్టర్ లక్ష్మీధర్ బెహెరా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మాంసాహారం తినకూడదని ప్రతిజ్ఞ చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడటం, మేఘావిస్పోటం వంటి సంఘటనలు జంతువులపై క్రూరత్వం కారణంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ ప్రకటన సంచలనం సృష్టించిస్తున్నాయి. విద్యార్థులను ఉద్దేశించి బెహెరా ఇలా అన్నారు. “మనం ఇలాగే కొనసాగితే.. హిమాచల్ ప్రదేశ్ మరింత నాశనమవుతోంది. అమాయక జంతువులను చంపుతున్నారు. ఇది పర్యావరణ క్షీణతతో సహజీవన సంబంధాన్ని కూడా కలిగి ఉంది... మీరు ప్రస్తుతం చూడలేరు కానీ అది అక్కడే ఉంది."

అతని వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'తరచుగా కొండచరియలు విరిగిపడటం, మేఘా విస్పోటనం అనేక ఇతర విషయాలు జరుగుతున్నాయి, ఇవన్నీ జంతువుల పట్ల క్రూరత్వం యొక్క ప్రభావాలే.. ప్రజలు మాంసం తింటారు. మనం మంచి వ్యక్తిగా మారాలంటే.. మాంసాహారం మానేయండి..’’ మాంసాహారం తినబోమని ప్రతిజ్ఞ చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండి పడుతున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తారు. ఈ వివాదంపై బెహరా నుంచి ఎలాంటి స్పందన లేదు. పారిశ్రామికవేత్త, IIT ఢిల్లీ పూర్వ విద్యార్థి సందీప్ మనుధనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)లో మాట్లాడుతూ, 'క్షీణత పూర్తయింది. 70 ఏళ్లలో ఏది కట్టినా ఇలాంటి మూఢ మూర్ఖులు దాన్ని నాశనం చేస్తారు ' అంటూ మండిపడ్డారు.

 ప్రొఫెసర్ బెహెరా ఇలాంటి ప్రకటన చాలా బాధాకరమని బయోఫిజిక్స్ ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ అన్నారు. బెహరా వ్యాఖ్యలు వివాదానికి దారితీయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో .. తాను స్వయంగా మంత్రాలను పఠించడం ద్వారా తన స్నేహితులలో ఒకరిని దుష్టశక్తుల నుండి విడిపించాడని వెల్లడించి వార్తల్లో నిలిచాడు.