కేరళలోని కొచ్చిలో ఐఐఎంసీ అల్యూమ్నీ అసోసియేషన్ 2023 కనెక్షన్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మలయాళీ రిపోర్టర్లకు జర్నలిజం అవార్డులు ప్రదానం చేశారు.  

కొచ్చి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అల్యూమ్నీ అసోసియేషన్ శనివారం (ఏప్రిల్ 29) కేరళలోని కొచ్చిలో కనెక్షన్స్ మీట్ నిర్వహించింది. ఈ ఏడాది కనెక్షన్స్ 2023 సమావేశాలు నిర్వహించడం ఇది మూడోది. ఈ సమావేశానికి హాజరైనవారికి కేరళ చాప్టర్ ప్రెసిడెంట్ కురియన్ అబ్రహమ్ స్వాగతం పలికారు.

సంధ్య మణికందన్ ఐఐఎంసీ కొట్టాయంలో 2017-18 మలయాళం జర్నలిజం బ్యాచ్‌కు చెందిన జర్నలిస్టు. బ్రాడ్ కాస్టింగ్ విభాగంలో ఇండియన్ లాంగ్వేజ్ రిపోర్టర్ ఆఫ్ ది ఇయర్ ఇఫ్కో ఐఐఎంసీఏఏ (IFFCO IIMCAA) అవార్డును సంధ్య మణికందన్‌కు అందించారు. ఆమెకు ఒక సైటేషన్‌, ట్రోఫీతోపాటు రూ. 50 వేల నగదును అందించారు. కేరళలో సాధారణంగా హిందూ పురుషులు నేర్చుకునే సాంప్రదాయ మార్షల్ ఆర్ట్ కలరిపయట్టును ముస్లిం యువతులు నేర్చుకోవడంపై ఆమె రిపోర్టింగ్ చేశారు.

ఐఐఎంసీ కొట్టాయం 2017-18 బ్యాచ్‌కు చెందిన బిజిన్ శామ్యూల్ ఇండియన్ లాంగ్వేజ్ రిపోర్ట్ ఆఫ్ ఇయర్ అవార్డును న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పొందారు. ఈయనకు పబ్లిషింగ్ కేటగిరీలో ఈ అవార్డు వరించింది. థంపు సంస్థ యూనిసెఫ్‌తో కలిసి గిరిజనుల ఉన్నతికి చేపట్టిన అవేర్ నెస్ ప్రోగ్రామ్ పై రిపోర్ట్ చేసినందుకు ఈ అవార్డు దక్కింది.

Also Read: "మీ బాధలు కాదు.. రాష్ట్రానికి మీరు ఏం చేశారో చెప్పండి".. ప్రధానిపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

కేరళ చాప్టర్ ప్రెసిడెంట్ కురియన్ అబ్రహం, వైస్ ప్రెసిడెంట్ కేఎస్ఆర్ మీనన్, ట్రెజర్ హుస్సేన్ కొడినిలు మీడియా పరిశ్రమలో గతంలో వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ యువ జర్నలిస్టులు కూడా తమ అనుభవాలను చెప్పుకున్నారు. ఇఫ్కో ఐఐఎంసీఏఏ అవార్డులు 2023 కన్వీనర్ సునీల్ మీనన్, ఐఐఎంసీఏఏ వ్యవస్థాపకుడు రితేశ్ వర్మలు కూడా ఈ సమావేశంలో మాట్లాడారు.