కర్ణాటక ఎన్నికలు: అమూల్ వర్సెస్ నందిని వివాదం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీపీఎల్ కుటుంబాలకు బీజేపీ అరలీటర్ పాలు ఉచితంగా అందజేస్తోందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు.
Karnataka Election 2023: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు మరో వారం రోజుల సమయం ఉండడంతో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పార్టీ కురువృద్ధుడు బిఎస్ యడ్యూరప్ప సమక్షంలో బిజెపి చీఫ్ జెపి నడ్డా మేనిఫెస్టోను ఆవిష్కరించారు.
ఇదిలా ఉండగా, ఆదివారం కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాటల దూషణల గురించి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రస్తావించిన వెంటనే #CryPMPayCM ట్విట్టర్‌లో ట్రెండింగ్ గా మారింది. ఎన్నికల నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రధాన రాజకీయ నేతలు ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన పార్టీకి ప్రచారం చేయడానికి మే 1న కర్ణాటకలోని తుమకూరులోని తురువేకెరె చేరుకున్నారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మిమ్మల్ని 91 సార్లు దుర్భాషలాడిందని మీరు అంటున్నారని రాహుల్ అన్నారు. కానీ, కర్ణాటక ప్రజలకు ఏం చేశారో చెప్పలేదని విమర్శించారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని కర్ణాటకకు వస్తారని, కానీ తన గురించే తానే చెప్పకున్నారు కానీ, గత 3 సంవత్సరాలలో కర్ణాటకకు ఏమి చేసారో చెప్పలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం, యువత కోసం మీరు ఏమి చేస్తారు? ఈ ఎన్నికలు మీ గురించి కాదు, కర్ణాటక భవిష్యత్తు గురించి. కాంగ్రెస్ మిమ్మల్ని 91 సార్లు దుర్భాషలాడిందని చెబుతున్నారే కానీ, కర్ణాటకకు మీరు ఏం చేశారో ఎప్పుడూ చెప్పడం లేదని విమర్శించారు. బిపిఎల్ కుటుంబాలకు మూడు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు ఇస్తామని బిజెపి ప్రకటించిందని, అయితే అంతకుముందు ఈ సిలిండర్ల ధరలు మూడు రెట్లు పెరిగాయని రాహుల్ అన్నారు.
అందరి ప్రయోజనాల కోసం మీరు ఎల్‌పిజి సిలిండర్ల ధరను ఎందుకు తగ్గించరు'? ప్రశ్నించారు. అమూల్ వర్సెస్ నందిని వివాదం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ బీపీఎల్ కుటుంబాలకు అర లీటరు పాలను ఉచితంగా అందజేస్తోందని కాంగ్రెస్ నేత అన్నారు. 'బాగా నడుస్తున్న ఇందిరా క్యాంటీన్లను మూసివేసి ఇప్పుడు ప్రతి వార్డులో ఆహార కేంద్రాన్ని తెరవాలని ప్రతిపాదించడం ఏమిటి' అని ఆయన నిలదీశారు. యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామని, ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారనీ, ఇదో కొత్త ఎత్తుగడగా కనిపిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు.
రాహుల్ వాగ్దానాలు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. గృహలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2000 ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. గృహజ్యోతి యోజన కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్న భాగ్య యోజన కింద కుటుంబ సభ్యులకు 10 కిలోల బియ్యం, యువ నిధి యోజన కింద రెండేళ్ల పాటు పట్టభద్రులకు రూ.3,000, డిప్లొమా హోల్డర్‌కు రూ.1,500 నెలరోజులపాటు అందజేస్తామని హామీ ఇచ్చారు.
కర్నాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. “మీ ముందుకు వచ్చి తనను దుర్భాషలాడుతున్నారని ఏడ్చే అలాంటి ప్రధానిని నేను మొదటిసారి చూస్తున్నాను. మీ బాధలను వినడం కంటే.. అతను తన బాధలను వివరించాడు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోండి. మోదీని ఎవరైనా ఎన్నిసార్లు దుర్భాషలాడారనే ఆ జాబితా తయారు చేస్తే.. ఒక పేజీకి సరిపోతుంది. నా కుటుంబంపై వారు (బీజేపీ నేతలు) చేసిన దుర్భాషలు చేసిన జాబితాలు తయారు చేయడం ప్రారంభిస్తే.. పుస్తకం తర్వాత పుస్తకం ముద్రించాల్సి వస్తుంది” అని అన్నారు.
సెప్టెంబరు 2022లో బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం ప్రభుత్వ కాంట్రాక్టుల నుండి 40% కమీషన్‌ను జేబులో వేసుకుందని ఆరోపణలు వచ్చిన తర్వాత క్యూఆర్ కోడ్‌లు, “పేసిఎం” క్యాప్షన్‌లతో బెంగళూరు అంతటా పోస్టర్లు పుట్టుకొచ్చాయి. ప్రియాంక గాంధీ ప్రసంగం అనంతరం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా ఆమె ప్రసంగానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. #CryPMPayCM అనే హ్యాష్ ట్యాగ్ పెట్టారు. ఈ వీడియోతో పాటు ఆ హ్యాష్ ట్యాగ్ కూడా ట్విట్టర్‌లో ట్రెండింగ్ గా మారింది.
