టమాటాలు తినడం మానేస్తే ధరలు తగ్గుతాయి - యూపీ మంత్రి ప్రతిభా శుక్లా వింత సలహా
టమాటాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత కొన్ని రోజులుగా వాటి ధరలు దిగిరావడం లేదు. ఈ నేపథ్యంలో యూపీ మంత్రి ప్రజలకు ఓ వింత సూచన చేశారు. ప్రజలెవరూ టమాటాలు కొనకూడదని, దీంతో ఆటోమెటిక్ గా ధరలు తగ్గుతాయని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతిభా శుక్లా చేసిన ప్రకటన వివాదానికి దారి తీసింది. టమాటాల ధర పెరిగితే వాటిని తినడం మానేయాలని ఆమె అన్నారు. లేదంటే వాటిని ఇంట్లోనే పెంచుకోవాలని సూచించారు. యూపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో శుక్లా పాల్గొని మొక్కలు నాటారు. ‘‘టమోటాలు ఖరీదైనవి అయితే ప్రజలు వాటిని ఇంట్లోనే పండించుకోవాలలి. టమాటాలు తినడం మానేస్తే ధరలు తప్పక తగ్గుతాయి. టమాటాకు బదులుగా నిమ్మకాయ కూడా తినవచ్చు. ఎవరూ టమాటాలు తినకపోతే వాటి ధరలు తగ్గుతాయి’’ అని చెప్పారు.
తమిళనాడులో డీఎంకే - కాంగ్రెస్ కూటమిలో ఎంఎన్ఎం చేరబోతోందా ? సందిగ్ధంలో కమల్ హాసన్..
అసాహి గ్రామంలోని పోషకాహార తోటను ఉదాహరణగా చూపుతూ.. ‘‘ ఈ గ్రామంలోని మహిళలు న్యూట్రిషన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇందులో టామాటాలు కూడా నాటవచ్చు. దీనితో ద్రవ్యోల్బణం సమస్య కూడా పరిష్కారమవుతుంది. ఇది కొత్త కాదు. టమాటాలు ఎల్లప్పుడూ ఖరీదైనవే. టమాటాలు తినకపోతే నిమ్మకాయ వాడండి. ఏది ఖరీదైనదైనా దానిని వాడకండి. దీంతో ఆటోమేటిక్ గా అవి చౌకగా మారుతాయి. ’’ అని ఆమె అన్నారు.
కాగా.. మంత్రి ప్రకటన వివాదాన్ని సృష్టించింది. ప్రజలపై ఆమెకు 'సున్నితత్వం' లేదని పలువురు విమర్శించారు. ఇదిలా ఉండగా.. గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉల్లిపాయలు తినడం మానేయాలని కోరారని, ఇప్పుడు శుక్లా టమాటాలు తినడం మానేయాలని కోరారని స్థానిక వ్యాపారవేత్త రవీంద్ర గుప్తా అన్నారు. మహిళా రాజకీయ నాయకులు ప్రజల పట్ల ఎంత సున్నితంగా ఉంటారో ఈ ప్రకటనలు తెలియజేస్తున్నాయని ఎద్దేవా చేశారు.