Asianet News TeluguAsianet News Telugu

‘లిక్కర్ తాగితే చస్తారుగా మరీ’..కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్

కల్తీ మద్యం మరణాలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాగితే చస్తారుగా మరీ.. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు కనిపిస్తూనే ఉన్నాయి కదా.. అని అన్నారు. మద్యంపై నిషేధం ఉన్నప్పుడు కూడా అమ్ముడవుతున్న లిక్కర్‌లో ఏదో తేడా ఉంటుందని ప్రజలూ అర్థం చేసుకోవాలని వివరించారు.
 

if you drink toxic liquor you will die slams bihar cm nitish kumar
Author
First Published Dec 15, 2022, 12:54 PM IST

పాట్నా: కల్తీ మద్యం మరణాలతో బిహార్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. శరణ్ జిల్లా చాప్రా టౌన్‌ల కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 30 దాటింది. దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు అధికార జేడీయూ, ఆర్జేడీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించాయి. అసెంబ్లీ లోపల, బయట కూడా బీజేపీ నుంచి తీవ్ర నిరసనను ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. ఈ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ రియాక్ట్ అయ్యారు. బిహార్‌లో మద్యపాన సేవనం పై నిషేధం అమలవుతున్న సంగతి తెలిసిందే.

కల్తీ మద్యం తాగి మరణించినవారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌ను సీఎం నితీశ్ కుమార్ దాదాపు కొట్టేశారు. రాష్ట్రంలో 2016 నుంచి మద్యపానంపై నిషేధం ఉన్నసంగతి తెలిసిందే అని, ప్రజలు మరింత జాగరూకతగా మెలగాల్సిన అవసరం ఉన్నది అని ఆయన అన్నారు. అంతేకాదు, లిక్కర్ తాగితే చస్తారు కదా అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మద్యపానంపై నిషేధాన్ని ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదని, ఈ అలసత్వాన్ని పేర్కొంటూ ప్రతిపక్షాలు నితీశ్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మద్యం ఎవరైతే తాగుతారో వారు చస్తారు కదా.. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే ముందు ఉన్నది. తాగితే చస్తావ్’ అని తెలిపారు. గతంలో ఇలాంటి కల్తీ మద్యం మరణాలకు నష్ట పరిహారాలను ప్రస్తావిస్తూ ఈ కామెంట్ చేశారు.

Also Read: బీహార్‌లో కల్తీ మద్యం కలకలం.. 30కి పెరిగిన మృతుల సంఖ్య.. ఇద్దరు పోలీసుల సస్పెండ్..

ఈ మరణాలపై బాధపడాల్సిందే అని, ఇలాంటి ఘటనలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉన్నదని సీఎం తెలిపారు. ఇందుకోసం తాము సామాజిక అవగాహన కార్యక్రమాలను భారీగా నిర్వహిస్తున్నామని వివరించారు. బాపు (మహాత్మా గాంధీ) ఏమన్నారో మీకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలూ లిక్కర్ ఎంతటి ప్రమాదకారో.. ఎంతమంది దీని కారణంగా చనిపోయారో ఇవి చెబుతున్నాయి. కల్తీ మద్యం తాగి మరణిస్తున్న ఘటనలు ఏళ్ల తరబడి జరుగుతూనే ఉన్నది. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

‘లిక్కర్ అమ్మకాలపై మేం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. లిక్కర్ పై నిషేధం ఉన్నప్పుడు కూడా అమ్ముతున్న లిక్కర్‌లో ఏదో తేడా ఉండే ఉంటుంది కదా’ అని అన్నారు. చాలా మంది లిక్కర్ తాగవద్దనే అనుకుంటున్నారని, అందుకే మద్యపానంపై నిషేధాన్ని అంగీకరించారని వివరించారు. కానీ, కొందరు తప్పు చేస్తున్నారని తెలిపారు. 

లిక్కర్ పై నిషేధం లేని రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రజలు కల్తీ మద్యంతో మరణిస్తున్నారని వివరించారు. 

మద్యపానంపై నిషేధాన్ని బిహార్‌తోపాటు గుజరాత్‌లోనూ అమలవుతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios