Asianet News TeluguAsianet News Telugu

బీహార్‌లో కల్తీ మద్యం కలకలం.. 30కి పెరిగిన మృతుల సంఖ్య.. ఇద్దరు పోలీసుల సస్పెండ్..

బీహార్‌లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించిన కారణంగా మరణించిన వారి సంఖ్య 30కి చేరింది. సరన్‌ జిల్లాలోని మష్రక్, ఇసువాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరణాలు నమోదయ్యాయి.

The death toll in bihar due to the consumption of spurious liquor rises to 30
Author
First Published Dec 15, 2022, 11:15 AM IST

బీహార్‌లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించిన కారణంగా మరణించిన వారి సంఖ్య 30కి చేరింది. సరన్‌ జిల్లాలోని మష్రక్, ఇసువాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరణాలు నమోదయ్యాయి. ఈ ఘటన బిహార్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన నేపథ్యంలో.. మార్హౌరా సబ్-డివిజనల్ పోలీసు అధికారి యోగేంద్ర కుమార్‌పై శాఖాపరమైన చర్యలు, బదిలీకి సిఫార్సు చేయబడింది. మష్రక్ ఎస్‌హెచ్‌వో రితేష్ మిశ్రా, కానిస్టేబుల్ వికేష్ తివారీలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. 

సరన్ ఇన్‌ఛార్జ్ సివిల్ సర్జన్ కమ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాగర్ దులాల్ సిన్హా మాట్లాడుతూ.. “మృతుల్లో ఎక్కువ మంది జిల్లా కేంద్రమైన ఛప్రాలోని ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం నుంచి అస్వస్థతకు గురైన కొందరు చికిత్స పొందుతూ మృతి చెందారు’’ అని చెప్పారు. ఇక, బిహార్‌లోని నితీస్ కుమార్ సర్కార్ 2016ల ఏప్రిల్‌లో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. 

 

మృతులంతా మత్తు పదార్థాలు సేవించి ఉంటారని అనుమానం ఉన్నందున, పోస్ట్‌మార్టం అనంతరం విసెరాను పరీక్ష కోసం ముజఫర్‌పూర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపుతామని అధికారులు తెలిపారు. మరోవైపు జిల్లా యంత్రాంగం అధికారుల బృందాలను ఏర్పాటు చేసిందని.. వారు ప్రభావిత గ్రామాల్లో పర్యటించి, అక్రమ మద్యం సేవించిన వారిని గుర్తించడానికి బాధిత కుటుంబాలను కలుసుకుంటారని చెప్పారు. మరోవైపు మద్యపాన నిషేధిత బీహార్‌లో.. కల్తీ మద్యం ఘటన బుధవారం రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios