సనాతన ధర్మాన్ని అవమానిస్తే నాలుక లాగేసి, కళ్లు పీకేస్తాం -కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. వ్యాఖ్యలు వైరల్
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారి నాలుక లాగేస్తామని, కళ్లు పీకేస్తామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హెచ్చరించారు. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా నాలుక లాగేస్తామని, కళ్లు పీకేస్తామని హెచ్చరించారు. షెకావత్ ఈ వ్యాఖ్యలు వారం రోజుల కిందటే చేసినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బీజేపీ పరివర్తన్ యాత్రలో భాగంగా ఆయన రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై షెకావత్ స్పందిస్తూ.. ‘‘ సనాతనానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా నాలుక లాగేస్తాం..సనాతనానికి వ్యతిరేకంగా ఉన్న ఆ కళ్లను కూడా తొలగిస్తాం’’ అని పేర్కొన్నారు. సనాతనానికి వ్యతిరేకంగా మాట్లాడే ఏ వ్యక్తీ ఈ దేశంలో రాజకీయ హోదాను, అధికారాన్ని నిలబెట్టుకోలేడని చెప్పారు. మన సంస్కృతి, చరిత్రపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
దాణా కుంభకోణం తదితర కుంభకోణాల్లో పాలుపంచుకున్న వారి సమూహమే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అని షెకావత్ అన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని ఓడించడమే ప్రతిపక్షాల లక్ష్యమన్నారు. ‘‘మోడీ గెలిస్తే సనాతన శక్తిమంతుడవుతారని, అందువల్ల ఆయనను ఓడించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారు. రెండు రోజుల క్రితం డీఎంకే ముఖ్యమంత్రి కుమారుడు సనాతనానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఆయన (ఉదయనిధి స్టాలిన్) దీనిని కరోనా వైరస్ తో పోలుస్తూ, సనాతన సంస్కృతిని దేశం నుండి తొలగించాలని అంటున్నారు’’ అని షెకావత్ తెలిపారు.
అనేక మంది ఆక్రమణదారులు 2,000 సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిని బలహీనపరచడానికి ప్రయత్నించారని షెకావత్ అన్నారు. ‘‘అల్లావుద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబు వంటి పాలకులు భారతీయ సంస్కృతిని బలహీనపరచడానికి ప్రయత్నించారు. కానీ మీ పూర్వీకులు (అక్కడి ప్రజలను ఉద్దేశించి), నా పూర్వీకులు సమర్థులు. అందుకే సంస్కృతిని పరిరక్షించారు. మహారాజా సూరజ్ మల్ అయినా, వీర్ దుర్గాదాస్ అయినా, మహారాణా ప్రతాప్ అయినా సనాతనపై దాడి చేసేవారిని సహించబోమని ఆ పూర్వీకులందరిపై ప్రమాణం చేస్తున్నాం. వారిని తరిమేస్తాం’’ అని కేంద్ర జల్ శక్తి మంత్రి అన్నారు.
కాగా.. సెప్టెబర్ 22వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఓ సభలో మాట్లాడుతూ.. సనాతన ధర్మం సమానత్వానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకమని అన్నారు. దాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూ జ్వరంతో పోల్చారు. ఇది వివాదాస్పదంగా మారింది.