Delimitation: దక్షిణాది వాణి అణచాలని చూస్తే బలమైన ప్రజా ఉద్యమం తప్పదు: కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక
డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల గళాన్ని అణచివేయాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని రాష్ట్రమంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అలా చేస్తే మొత్తం దక్షిణాది రాష్ట్రాల నుంచి బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని కేంద్రాన్ని హెచ్చరించారు.
హైదరాబాద్: పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని హెచ్చరించారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల ఎంపీ స్థానాలను తగ్గించాలని చూస్తే దక్షిణాది నుంచి బలమైన ప్రజా ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు. జాతీయ మీడియా ప్రచురించిన ఓ కథనానికి సంబంధించిన చిత్రాన్ని పేర్కొంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘ఈ కథనంలో పేర్కొన్న గణాంకాలు సరైనవైతే.. ఈ డీలిమిటేషన్ దక్షిణ భారతం నుంచి ఒక బలమైన ప్రజా ఉద్యమాన్ని లేవదీస్తుంది. భారతీయులుగా మేం గర్వపడుతాం. దేశంలోనే ప్రగతిశీల రాష్ట్రాల ప్రతినిధులుగానూ గర్విస్తాం. కానీ, భారత ప్రజాస్వామిక ఉన్నతమైన వేదికపై మా ప్రజా ప్రతినిధుల గళాన్ని అణచివేయాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. విజ్ఞానం విజయం పొందాలని ఆశిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాలను వింటున్నదనీ భావిస్తున్నాను’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Also Read: చంద్రబాబు అరెస్టుపై చాడ వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ‘వాస్తవాలు త్వరలో బయటకు..’
డీలిమిటేషన్ పై వస్తున్న అంచనాల ప్రకారం, అదనంగా 32 స్థానాలు కలిసి రానుండగా, దక్షిణాది రాష్ట్రాలు 24 పార్లమెంటు స్థానాలను కోల్పోతాయని తెలుస్తున్నది. తమిళనాడు నుంచి, కేరళ నుంచి ఎనిమిది, తెలంగాణ ఏపీల నుంచి 8 స్థానాలను తగ్గిపోతాయని అంచనా. కాగా, మధ్యప్రదేశ్‌లోనాలుగు, రాజస్తాన్‌లో 6, బిహార్‌లో పది, ఉత్తరప్రదేశ్‌లో 11 స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2026 ఏడాదికల్లా జనాభాను అంచనా వేసి అందుకు అనుగుణంగా పార్లమెంటు సీట్లను సవరించాలనే ప్రయత్నాలు మొదలైన సంగతి తెలిసిందే.