రోడ్డు ప్రమాద బాధితులకు మొదటి 48 గంటలు అందే వైద్యం చాలా ముఖ్యమైనది. మొదటి 48 గంటలు వైద్యం అందించే విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఓ కొత్త పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఎన్నో ప్రాణాలు నిలవనున్నాయి.
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వారిని హాస్పిటల్స్‌లో చేర్చేందుకు చాలా మంది ముందుకురారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. క్షతగాత్రులను హాస్పిటల్స్‌కు తీసుకెళ్తే అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందనేది ఒక కారణమయితే.. హాస్పిటల్స్‌లో సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టాల్సి రావడం, కొన్ని సార్లు గంటలు గంటలు అక్కడే ఉండాల్సి రావడం మరో కారణాలు. కానీ ప్రమాదం జరిగిన వెంటనే హాస్పిటల్స్ కు తీసుకురాలేకపోవడం వల్ల చాలా ప్రాణాలు పోతున్నాయి. దీనిని నివారించడానికి తమిళనాడు ప్రభుత్వం ఒక కొత్త పథకం ప్రవేశపెట్టింది.
‘నమ్మై కాక్కుం 48’
రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులను కాపాడేందుకు తమిళనాడు ప్రభుత్వం ఓ విన్నూత్న పథకాన్ని ప్రారంభించింది. ఇలాంటి పథకం ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేదు. ఈ పథకం కొత్త పథకం పేరు ‘నమ్మై కాక్కుం 48’ అంటే 48 గంటల్లో ప్రాణాలను కాపాడుదాం అని అర్థం. అంటే ఏదైనా ప్రమాదంలో గాయాలపాలైన వారికి 48 గంటల పాటు అవసరమైన చికిత్సను ప్రభుత్వమే అందిస్తుంది. అది ప్రైవేట్ హాస్పిటల్ అయినా ప్రభుత్వ హాస్పిటల్ అయినా.. ఆ ఖర్చు మొత్తం తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుంది. ప్రమాదం జరిగిన చోటు నుంచి ఏ ప్రైవేట్ హాస్పిటల్ లో అయినా బాధితులు చేరవచ్చు. మొదటి 48 గంటల పాటు వైద్యానికి అయిన ఖర్చు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. క్షతగాత్రులకు మొదటి 48 గంటల పాటు ఇచ్చే వైద్యం చాలా ముఖ్యమైనది. ఆ సమయంలో మెరుగైన ట్రీట్మెంట్ అందితే ప్రాణాప్రాయం నుంచి తప్పించుకోవచ్చు. అందుకే ఇలాంటి కొత్త పథకానికి శ్రీకారం చుట్టామని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. ఇది కేవలం తమిళనాడు వాసులకే అనుకుంటే పొరపాటే. ఆ రాష్ట్ర పరిధిలో దేశంలోని ఏ వ్యక్తికి ప్రమాదం జరిగినా ఈ పథకం వర్తిస్తుంది. అలాగే ఇతర దేశాలకు చెందిన పౌరులకు 48 గంటల పాటు ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వనున్నారు.
కేరళలో రక్తచరిత్ర.. గంటల వ్యవధిలోనే రెండు రాజకీయ హత్యలు.. బీజేపీ, ఎస్‌డీపీఐ నేతల మర్డర్
చేర్చిన వారికి ప్రోత్సహాకాలు..
ప్రమాదం జరిగిన చోటు నుంచి హాస్పిటల్స్‌కు తీసుకొచ్చే ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ఘటనా స్థలంలో సాధారణ ప్రజలు ఉన్న కొన్ని సార్లు వారిని హాస్పిటల్స్‌కు తీసుకొచ్చేందుకు భయపడుతున్నారు. అనవసరంగా పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందనేది ఓ కారణం. అయితే గతేడాది ఇలాంటి విషయంలో సుప్రీం కోర్టు ఓ తీర్పు ఇచ్చింది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి హాస్పిటల్స్ కు తీసుకొచ్చిన ప్రజలను పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పవద్దని, వారిని విచారణ పేరుతో ఇబ్బంది పెట్టకూడదని సూచించింది. ఇలా చేస్తే ఎక్కువ ప్రాణాలను రక్షించవచ్చని అభిప్రాయపడింది. ఇప్పుడు ఇదే విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఓ ముందడుగు వేసింది. బాధితులను హాస్పిటల్స్‌కు తీసుకొచ్చే వారిని ఇబ్బంది పెట్టకుండా ప్రోత్సహాకాలు అందించాలని భావిస్తోంది. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తీసుకొచ్చిన వారికి రూ.5 వేలు అందజేయాలని నిర్ణయించింది. ‘నమ్మై కాక్కుం 48’ పథకంలో ఇది కూడా ముఖ్యమైన అంశం. ఈ పథకాన్ని మొదటి విడతగా తమిళనాడు 609 హాస్పిటల్స్‌లో ప్రయోగాత్మకంగా శనివారం నుంచి అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడారు. అందరూ రోడ్డు సెఫ్టీ రూల్స్ పాటించాలని సూచించారు. ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఈ పథకం తీసుకొచ్చామని చెప్పారు.
