రజనీ, కమల్ మధ్య మాటల యుద్ధం

రజనీకాంత్, కమల్ హాసన్.. విరిద్దరూ ఎంత మంచి మిత్రులో అందరికీ తెలిసిందే. వీరిద్దరూ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారనగానే.. తమిళనాట తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కమల్ తన పార్టీ పేరును కూడా ప్రకటించేశారు. కానీ.. రజనీ మాత్రం ఎటు తేల్చకుండా కాలం గడుపుతున్నారు. 

కాగా.. వీరిద్దరూ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టనప్పటికీ.. వీరి మధ్య స్నేహం వైరంగా మారుతోందనే వాదనలు వినపడుతున్నాయి. ఇందుకు కారణం ఇటీవల జరిగిన ఓ సంఘటన. 

తుత్తుకూడిలోని స్టెరిలైట్ ఫ్యాక్టరీపై పోరాటంలో సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందనీ.. ప్రతి సమస్యకు ఆందోళనకారులు రోడ్డెక్కితే తమిళనాడు శ్మశానంలా మారుతుందంటూ రజినీకాంత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. 

తలైవార్ వ్యాఖ్యలపై మక్కళ్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవాళ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని కలుసుకునేందుకు బయల్దేరిన ఆయన... చెన్నై ఎయిర్‌పోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ...

‘‘ ఆందోళనకారులు సంఘ వ్యతిరేకులైతే.. నేను కూడా వాళ్లలో ఒకడినే...’’ అని కౌంటర్ ఇచ్చారు. కత్తులు, తుపాకులతో పోరాడడమే నిరసనలు కాదనీ.. ఒకవేళ తుపాకులు గర్జించే పరిస్థితి వస్తే ప్రజలు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

 ‘‘ఉద్యమాలకు ఓ లక్ష్యం ఉంటుంది. అయితే ఆందోళనల సందర్భంగా హింస తలెత్తితే... హింసను తగ్గించాలి. అంతేకాని ఉద్యమాలను నీరుగార్చడం లేదా ఆపడం చేయకూడదు...’’ అని కమల్ కుండబద్దలు కొట్టారు.