కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని వివరించారు. అదే విధంగా ఇతర పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ కూడా వాటికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. 

కోల్‌కతా: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి తాము మద్దతు ఇస్తామనే సంకేతాలు సోమవారం ఇచ్చారు. అయితే, తృణమూల్ కాంగ్రెస్ పట్ల కాంగ్రెస్ పార్టీ కూడా అదే రీతిలో వ్యవహరించాలని అన్నారు.

కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే బలంగా ఉన్నదో .. అక్కడ తాము ఆ పార్టీకి మద్దతు ఇస్తామని అన్నారు. అయితే, కాంగ్రెస్ కూడా అదే విధంగా మద్దతు ఇస్తున్న ఇతర పార్టీలకు అవి బలంగా ఉన్న ప్రాంతాల్లో మద్దతు ఇవ్వాలని చెప్పారు. అంతేకానీ, కర్ణాటకలో టీఎంసీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నదని మరొకరు వ్యతిరేకంగా వెళ్లాల్సిన అవసరం లేదని వివరించారు.

కాంగ్రెస్ పార్టీ 200 స్థానాల్లో బలంగా ఉన్నదని మమతా బెనర్జీ అంచనా వేశారు. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితుల గురించి మాట్లాడుతూ, యూపీలో అఖిలేశ్ యాదవ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ బలంగా ఉన్నదని, అక్కడ తాము సమాజ్‌వాదీ పార్టీకి మద్దతు ఇస్తామని తెలిపారు. అయితే, అదే విధంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకూడదని తాము అనడం లేదని, అలాంటి అంశాలపై తాము చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

Also Read: తాగుబోతు భర్తను మార్చడానికి స్వయంగా ‘తాగుబోతు’గా మారిన భార్య.. చివరకు ఇద్దరి మధ్య అగ్రిమెంట్

ఎక్కడ.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉన్నదో.. మిగతా పార్టీలు వాటికి మద్దతు ఇవ్వాలని ఆమె తెలిపారు. ఢిల్లీలో ఆప్ బలంగా ఉంటుందని, కాబట్టి, అక్కడ అన్ని పార్టీలు ఆప్‌నకు మద్దతు ఇవ్వాలని చెప్పారు. బెంగాల్‌లో టీఎంసీ, బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీలు బలంగా ఉంటాయని అన్నారు.