తాగుబోతు భర్తను మార్చుకోవడానికి ఆ భార్య నమ్మశక్యం కాని నిర్ణయం తీసుకుంది. మద్యం మత్తులో తూలుతు ఇంటికి వచ్చి గొడవ పెట్టుకునే భర్త.. ఆ తర్వాత షాక్ అయ్యాడు. భార్య కూడా మద్యం మత్తులో జోగుతూ కనిపించడంతో ఆలోచనలో పడ్డాడు. ఆయనే స్వయంగా కౌన్సెలర్లను ఆశ్రయించి భార్యను తీసుకెళ్లాడు. ఆ తర్వాత చివరకు ఇద్దరి మధ్య అగ్రిమెంట్ కుదిరింది.
భర్త రోజూ తాగి వస్తాడు. ఇంటికి వచ్చాక.. భార్యతో గొడవ పెట్టుకుంటాడు. ఎందుకు తాగుతున్నావని అడిగినందుకు రచ్చ చేస్తాడు. ఇది ఒక రోజు.. రెండు రోజులు కాదు. ప్రతి రోజూ జరిగే తంతు. ఆ మహిళ ఈ వేదన భరించలేకపోయింది. ప్రతి రోజూ ఇదే టార్చర్ అయితే ఇక జీవితమే దండగ అనుకుంది. ఎలాగైనా భర్తను మార్చాలని అనుకుంది. వీలైనన్ని సార్లు ఆయనకు తాగడం ఎందుకు? దాని వల్ల ఆరోగ్యం పాడవుతుందని, డబ్బులూ ఖర్చవుతాయని, సంసారం ప్రమాదంలో పడుతుందని.. పలు విధాలుగా ఆమె చెప్పి చూసింది. కానీ, భర్తలో ఏ మార్పు లేదు. అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం నమ్మశక్యంగా లేదు.
ఆగ్రాకు చెందిన మహిళ తన తాగుబోతు భర్తను మందుకు దూరం చేయాలని ఊహించని నిర్ణయం తీసుకుంది. ఆమె స్వయంగా తాగుబోతు అవతారం ఎత్తింది. ప్రతి రోజూ భర్త మద్యం మత్తులో తూలుత ఇంటికి వచ్చే సరికి.. ఆమె కూడా మత్తులో జోగుతూ ఉన్నట్టు కనిపించేది. తన భార్య కూడా మద్యం సేవిస్తున్నదని భర్త అనుకుంటాడు. కొన్నాళ్లకు.. తన భార్యకు మద్యం వ్యసనంగా మారిందనీ భావిస్తాడు. ఇక ఆయన తన భర్తను వేడుకోవడం ఎలా అనే తర్జనభర్జనలో పడతాడు. దీనికి బదులు ఒక ఆలోచన చేస్తాడు.
ఇద్దరూ మద్యానికి వ్యసనం కావడంతో భర్త జీర్ణించుకోలేకపోయాడు. ఓ ఫ్యామిలీ కైన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించాడు. భార్యను అక్కడికి తీసుకెళ్లాడు. తన భార్య మద్యానికి బానిసైందని, ఆమెకు మద్యం మాన్పించాలని కోరాడు. వెంటనే భార్య కూడా భర్తపై ఆరోపణలు చేసింది. తన భర్త కూడా రోజూ మద్యం సేవించి మత్తులో ఇంటికి వస్తున్నాడని తెలిపింది.
Also Read: కెనడాలో కొండ చిలువను ఆయుధంగా మలుచుకుని ప్రత్యర్థిపై దాడి చేసిన వ్యక్తి.. వీడియో వైరల్
తన భార్య మద్యం మత్తులో నానా రభస చేస్తున్నదని, ఓ వీడియోను భర్త కౌన్సెలర్లకు చూపించాడు. తన భార్య మద్యానికి బానిసై తన కుటుంబం పరువు తీసిందని పేర్కొన్నాడు.
అప్పుడు భార్య ఓ సీక్రెట్‌ను రివీల్ చేసింది. తాను మద్యానికి బానిస కాలేదని, తన భర్త మద్యం క్రమంగా తగ్గించుకోవాలనే ఉద్దేశంతో తానూ మద్యం సేవించి మత్తులో ఉన్నట్టుగా నటించానని చెప్పింది.
ఇద్దరి వాదనలు విన్న కౌన్సెలర్లు.. వారి మధ్య ఒక అగ్రిమెంట్ రాయించారు. భర్త కొన్ని కండీషన్లతో అగ్రిమెంట్ పై సైన్ చేశాడు. తాను వారానికి ఒక్కసారి మాత్రమే మద్యం సేవిస్తానని, అలాగే, భార్యతో ఎప్పుడూ గొడవ పడనని అంగీకరించాడు.
