ఒక వేళ 2024 ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే నరేంద్ర మోడీ.. నరేంద్ర పుతిన్‌గా మారిపోతారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. ఇక ఎన్నికలనేవే ఉండకుండా పోతాయని ఆరోపించారు. ఇప్పటికే బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆయనను దేశానికే ఒక మాలిక్‌గా భావిస్తున్నారని తెలిపారు. 

న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన మహా ర్యాలీలో ఆయన మాట్లాడుతూ మోడీపై విరుచుకుపడ్డారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గనక మళ్లీ గెలిస్తే నరేంద్ర మోడీ ఇక నరేంద్ర పుతిన్ అవుతారని ఆరోపించారు.

‘ఒక వేళ 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీనే మళ్లీ గెలిస్తే.. ఎన్నికలనేవే ఉండవు. నరేంద్ర మోడీ ఆ తర్వాత నరేంద్ర పుతిన్‌గా మారిపోతారు’ అని భగవంత్ మాన్ అన్నారు. బీజేపీ నేతలు ఇప్పటికే నరేంద్ర మోడీని ఈ దేశ ‘మాలిక్’ అని విశ్వసిస్తున్నారని విమర్శించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఒక నిర్ణయానికి వస్తే ఈ దేశాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో మహా ర్యాలీ నిర్వహిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల సేవలపై నియంత్రణను తమ నుంచి లాక్కుంటూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ వ్యతిరేకిస్తూ ఆప్ ఈ మహా ర్యాలీ నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం, ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ ఆప్ నేత, మినిస్టర్ గోపాల్ రాయ్, ఆఫ్ ఎంపీ సంజయ్ సింగ్‌లు మాట్లాడారు.

Also Read: బీచ్‌లలో కూడా చేసుకుంటున్నారా? దయచేసి అక్కడ వద్దు: సందర్శకులకు ప్రభుత్వం నో సెక్స్ రిక్వెస్ట్

ఢిల్లీ అధికార పార్టీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతున్నది. ఆ ఆర్డినెన్స్ వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఢిల్లీ ప్రజల సంక్షేమం కోసం కేంద్రం సహకరించాలని డిమాండ్ చేస్తున్నది.