Asianet News TeluguAsianet News Telugu

మసీదుల్లో ఆలయాల కోసం బీజేపీ వెతికితే, ఆలయాల్లో బౌద్ధ మఠాల కోసం వెతుకులాట ప్రారంభమౌతుంది - స్వామి ప్రసాద్ మౌర్య

ప్రతీ మసీదులో బీజేపీ ఆలయాల కోసం వెతికితే.. ప్రతీ ఆలయంలో బౌద్ధ మఠాల కోసం కూడా వెతకడం ప్రారంభమవుతుందని సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు. కాషాయ పార్టీ కుట్రపూరితంగా మసీదు-ఆలయ అంశాన్ని లేవనెత్తుతోందని ఆరోపించారు.

If BJP looks for temples in mosques, it will start looking for Buddhist monasteries in temples - Swami Prasad Maurya..ISR
Author
First Published Jul 31, 2023, 12:18 PM IST

బద్రీనాథ్, కేదార్ నాథ్ ఆలయాలపై సమాజ్ వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతీ మసీదులో బీజేపీ ఆలయాల కోసం వెతుకుతుంటే.. ప్రజలు కూడా ప్రతీ దేవాలయంలో బౌద్ధ మఠం కోసం వెతకడం ప్రారంభిస్తారని ఆయన అన్నారు. వారణాసి, మథురలో నెలకొన్న వివాదాలను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్, కేదార్ నాథ్ ఆలయాలు, పూరీలోని జగన్నాథ ఆలయం, కేరళలోని అయ్యప్ప ఆలయం, పండరీపూర్ (మహారాష్ట్ర)లోని విఠోబా ఆలయాలు బౌద్ధ ఆరామాలు. బౌద్ధ మఠాలను కూల్చివేసి తరువాత అక్కడ హిందూ ధార్మిక మందిరాలు నిర్మించారు. అవి ఎనిమిదో శతాబ్దం వరకు బౌద్ధ మఠాలుగా ఉండేవి’’ అని అన్నారు. ఈ ఆలయాలన్నీ బౌద్ధ మఠాలు అనడానికి చారిత్రక ఆధారాలు పుష్కలంగా ఉన్నాయని స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు.

ఈ ఆలయాలను బౌద్ధ మఠాలుగా మార్చడం తన ఉద్దేశం కాదని, కానీ ప్రతి మసీదులో ఆలయం కోసం వెతికితే, ప్రతి దేవాలయంలో బౌద్ధ మఠాన్ని ఎందుకు వెతకకూడదని మౌర్య ప్రశ్నించారు. బీజేపీ కుట్రపూరితంగా మసీదు-ఆలయ అంశాన్ని లేవనెత్తుతోందన్నారు. ‘‘ప్రతీ మసీదులో గుడి కోసం చూస్తున్నారు. దీని వల్ల వారికే భారీగా నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే ప్రతీ మసీదులో ఒక ఆలయం కోసం వెతుకుతుంటే, ప్రజలు ప్రతీ ఆలయంలో బౌద్ధ మఠం కోసం వెతకడం ప్రారంభిస్తారు’’ అని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. 

కాగా.. స్వామి ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. సనాతన ధర్మాన్ని పదేపదే అవమానించడం సమాజ్ వాదీ పార్టీకి, ఆ పార్టీ నేతలకు అలవాటుగా మారిందని ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ భూపేంద్ర సింగ్ చౌదరి ఆరోపించారు. హిందువుల విశ్వాస కేంద్రాలైన బాబా కేదార్ నాథ్, బాబా బద్రీనాథ్, జగన్నాథ్ పూరీలపై మౌర్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదనవమే కాకుండా, ఆయన చిల్లర మనస్తత్వానికి, చిల్లర రాజకీయాలకు నిదర్శనమని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌర్య ప్రకటన దేశంలో, ఉత్తరప్రదేశ్ లోని కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచిందని, సమాజంలో విద్వేషాలను సృష్టించిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలకు మౌర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని తెలియజేయాలని, ఆయన వ్యాఖ్యలను పార్టీ అంగీకరిస్తుందో లేదో స్పష్టం చేయాలని ఆయన ట్వీట్ చేశారు.

ఈ విమర్శలపై మౌర్య ఆదివారం స్పందించారు. తాను బద్రీనాథ్, కేదార్ నాథ్ ధామ్ గురించి మాట్లాడానని తెలిపారు. ఏడో శతాబ్దం చివరి నుంచి ఎనిమిదో శతాబ్దం ప్రారంభం వరకు బద్రీనాథ్ బౌద్ధ మఠమని, ఆ తర్వాత శంకరాచార్య దానిని మార్చి హిందువులకు మతపరమైన ప్రదేశంగా స్థాపించారని చెప్పారు. ‘‘అందరి విశ్వాసం (ఆస్తా) ముఖ్యమని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి చెప్పాలనుకుంటున్నాను. మీ 'ఆస్తా' గురించి మీరు ఆందోళన చెందుతుంటే, మీరు ఇతరుల 'ఆస్తా' గురించి కూడా ఆందోళన చెందాలి’’ అని అన్నారు. కాగా.. మౌర్య వ్యాఖ్యలను బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఖండించారు. ఎన్నికలకు ముందు మౌర్య కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios